Cricket Match : క్రికెట్ చూస్తూ రెచ్చిపోతున్నారా ఈ వార్త మీ కోసమే
ABN , Publish Date - Mar 26 , 2025 | 06:28 PM
Cricket : క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే కాదు. మనస్సుకు సంబంధించిన ఓ భావోద్వేగం. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఓ విధమైన భావోద్వేగాన్ని గమనిస్తూ ఉంటాం. అయితే ఈ భావోద్వేగాన్ని నియంత్రిణకు మనస్తత్వ శాస్త్ర నిపుణులు పలు చిట్కాలు చెబుతున్నారు.

క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు.. దేశంలో దాదాపు 90 శాతం మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ టీవీల ముందు కూర్చొంటారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. దేశం యావత్తూ ఓ పండగ చేసుకుంటుందంటే అతిశయోక్తి కాదేమో. అంటే దేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు.. ఓ భావోద్వేగ ప్రయాణమని అర్థమవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ 2025 టోర్నమెంట్ జరుగుతోంది.
ఈ మ్యాచ్‌లు చూసే సమయంలో అభిమానులు వివిధ రకాల భావోద్వేగాలకు గురవుతున్నారన్నది సుస్పష్టం. ఇంకా చెప్పాలంటే.. గెలిస్తే ఆనందం. ఓడితే నిరాశ. ఆట జరుగుతూన్న సమయంలో ఓ విధమైన టెన్షన్.. టెన్షన్ అనుభవిస్తారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందుకు గల కారణాలు, నియంత్రణ మార్గాలపై మనస్తత్వ శాస్త్ర నిపుణులు ఏమంటున్నారంటే..
తొలుత క్రికెట్ జట్టుతో భావోద్వేగ బంధాన్ని ఫ్యాన్స్ ఏర్పరుచుకొంటారు. ఆ క్రమంలో గెలిస్తే వ్యక్తిగత విజయంగా.. ఓటమి పాలైతే.. వైఫల్యంగా భావిస్తారు.ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. 2025, మార్చి 25వ తేదీన సన్ రైజర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ అభిమాని టీవీ రిమోట్ పగలకొట్టాడు. అంటే మెదడులో ఆనందం (డోపమైన్), ఒత్తిడి(కార్టిసాల్) హర్మోన్లు హెచ్చుతగ్గులకు లోనుతాయి.
మ్యాచ్ వీక్షిస్తున్నప్పుడు.. అంటే వికెట్ పడడం లేదా సిక్సర్ కొట్టిడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటే.. అంటే ఊహించని ఫలితాలు వస్తే.. గుండె వేగం ఆటోమెటిక్‌గా పెరుగుతోంది. అలాగే సామాజిక ఒత్తిడి కూడా కారణం.. అంటే.. సన్నిహితులతో వాదనలతోపాటు అంచనాలు సైతం ఒత్తిడిని పెంచుతాయి. ఇక మ్యాచ్ జరిగే సమయంలో 60 శాతం మంది అభిమానులు ఘర్షణలకు దిగడం లేకుంటే.. నిరాశను అనుభవిస్తారని ఓ అద్యయనంలో రుజువు అయింది.
అయితే వీటిని ఎలా నియంత్రించాలంటే.. ఇవిగో చిట్కాలు
క్రికెట్‌ను ఓ ఆటగా మాత్రమే చూడాలి. ఇది జీవన్మరణ సమస్యగా కాదు. జయాపజయాలు తాత్కాలికమని గుర్తించాలి.
మ్యాచ్ జరిగే సమయంలో టెన్షన్ కాస్త అధికమైతే.. శ్వాస వ్యాయామాలు ఉపయోగపడతాయి. ఈ సమయంలో 4-7-8 టెక్నిక్ (అంటే.. 4 సెకన్లు శ్వాస తీసుకోవడం, 7 సెకన్లు ఆపడం, 8 సెకన్లు వదలడం) ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఇక బెట్టింగ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. బెట్టింగ్‌లో నగదు పెట్టడం ఒత్తిడిని రెట్టింపు చేస్తుంది. దీంతో తీవ్ర టెన్షన్ పడే అవకాశం ఉంది.
మ్యాచ్ సమయంలో స్నాక్స్ తినడం, నీళ్లు తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మ్యాచ్ సమయంలో స్నేహితులతో ఘర్షణలు జరగకుండా చూసుకోవాలి. ఆటను ఆస్వాదించడంపై దృష్టి పెట్టాలి. ఈ సందర్భంగా మనస్తత్వ నిపుణులు ఈ విధంగా సూచిస్తున్నారు.
క్రికెట్ అనంతరం వాకింగ్ చేయాలి. లేదా సంగీతం వినాలి. తద్వారా భావోద్వేగాలను అదుపులో ఉంచుతుందని వారు వివరిస్తున్నారు.