IndiGo Flight Preponed: ఇండిగో విమానం 15 నిమిషాలు ముందుగా బయలుదేరడంతో ప్రయాణికుడికి భారీ షాక్!
ABN , Publish Date - Jan 23 , 2025 | 09:49 PM
విమానం షెడ్యూల్ మార్పు కారణంగా 15 నిమిషాల ముందుగా బయలుదేరడంతో ఓ ప్రయాణికుడు ఫ్లైట్ మిస్సయ్యాడు. ఈ మేరకు అతడు నెట్టింట పంచుకున్న పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో విమానం షెడ్యూల్ చివరి నిమిషంలో మారడంతో ఓ ప్రయాణికుడు తన ఫ్లైట్ మిస్సైన ఘటన తాజాగా వెలుగు చూసింది. అసలేం జరిగిందీ చెబుతూ అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. ప్రఖార్ గుప్తా అనే ప్రయాణికుడు ఈ పోస్టును నెట్టింట పంచుకున్నారు. విమానం షెడ్యూల్ కంటే 15 నిమిషాలు ముందుగా బయలుదేరుతున్నట్టు తనకు జర్నీకి రెండున్నర గంటల ముందే తెలిసిందని వాపోయాడు. తనకు ఓ చిన్న టెక్స్ట్ మేసేజీ మినహా ఈమెయిల్ సంస్థ నుంచి రాకపోవడంతో ఫ్లైట్ మిస్సైనట్టు చెప్పుకొచ్చారు (IndiGo Flight Preponed).
‘‘ఫ్లైట్ 15 నిమిషాల ముందుగా బయలుదేరుతుందన్న విషయాన్ని ప్రయాణికులు జర్నీకి 2.5 గంటల ముందు చెబితే ఎలా? అయినా నేను కేవలం ఐదు నిమిషాల ఆలస్యంగా వచ్చినా నన్ను మాత్రం విమానం ఎక్కేందుకు అనుమతించలేదు’’ అని గుప్తా రాసుకొచ్చారు.
‘‘నాకు ఏ ఈమెయిల్ కూడా రాలేదు. ఫ్లైట్ ఉదయం 6.45కి బయలుదేరుతుందని తొలుత చెప్పారు. కానీ తెల్లవారుజామును 4 గంటలకు ఓ చిన్న మెసేజీ పంపించి ఫ్లైట్ 6.30కే బయలుదేరుతుందని సమాచారం ఇచ్చారు. ఆ తరువాత కేవలం ఐదు నిమిషాల ఆలస్యంగా వస్తే విమానంలోకి అనుమతించలేదు. ఇది చాలదన్నట్టు మూడు వేలతో మరో టిక్కెట్ కొనిపించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టాఫ్ కూడా తనతో దురుసుగా ప్రవర్తించారని అన్నారు. సమస్యకు పరిష్కారం పేరిట తనను ఒక కౌంటర్ నుంచి మరో కౌంటర్‌కు తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. వెకిలి నివ్వులు నవ్వుతూ అమర్యాదకరంగా ప్రవర్తించారని అన్నారు.
సంస్థలో ఎవరూ ప్రయాణికుల విషయంలో బాధ్యతా యుతంగా వ్యవహరించట్లేదని అన్నారు. ప్రజల సమయాన్ని, డబ్బును అస్సలు గౌరవించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్ తప్పులకు తాము డబ్బులు కోల్పోవాల్సి వస్తోందని అన్నారు.
ఈ పోస్టు వైరల్ కావడంతో ఇండిగో స్పందించింది. ఈ అంశంపై దృష్టి సారించామని, సమస్యకు పరిష్కారంతో అతడిని సంప్రదిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించింది.