Viral: ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్‌అండ్‌టీ చైర్మన్‌పై కొనసాగుతున్న విమర్శలు!
ABN , Publish Date - Jan 10 , 2025 | 09:40 PM
వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ సూచనపై సాటి కార్పొరేట్ల నుంచే విమర్శలు మొదలయ్యాయి. రవాణా సమయం కూడా కలుపుకుంటే ఇప్పటికే ఉద్యోగులు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగులు ఆదివారాలు కూడా పనిచేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన సూచన ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సినీనటులతో సహా ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ఈ సూచనపై విమర్శలు గుప్పించారు. తాజాగా సాటి కార్పొరేట్లు కూడా ఈ జాబితాలో చేరారు. ఇప్పటికే ఉద్యోగులు రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు (Viral).
‘‘వారానికి 70 గంటలైనా లేదా 90 గంటలైనా ఉద్యోగులు కష్టించి పనిచేయడం అవసరమే. అయితే, పనిలో నాణ్యత, ఉత్పాదకత, ప్రభావశీలత మరింత ముఖ్యం. ఎన్ని గంటలు పనిచేశామన్న దానికంటే ఈ అంశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నా అభిప్రాయం’’ అని అన్నారు.
Viral: ఎమ్‌బీయే చేశాక జొమాటోలో జాబ్ ఆఫర్ వస్తే సంతోషపడ్డాడు! శాలరీ ఎంతో తెలిశాక..
ప్రస్తుత ఆధునిక ఉద్యోగ జీవితం ఇప్పటికే ఉరుకులపరుగుల మయంగా మారిందని అన్నారు. ఆఫీసుకు రానూపోనూ సమయాన్ని చూసుకుంటే రోజుకు 12 గంటలు పనికే వెచ్చిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకే సగం రోజు సరిపోతోందని చెప్పారు. ఇక ఉద్యోగ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు.
‘‘కాబట్టి, రోజుకు 12 గంటలు ఉద్యోగులు పనికి కేటాయిస్తున్నారంటే అది ఎక్కువనే చెప్పాలి. అయితే, ఉద్యోగుల పని గంటలు తక్కువైన కారణంగా కంపెనీలో అంతర్జాతీయంగా పోటీ పడలేకపోతున్నాయంటే లోపం ఎక్కడుందనేదానిపై కంపెనీ నాయకత్వం ముదింపు వేసుకోవాలి. కంపెనీల్లో చాలా సందర్భాల్లో సమస్యలు, లోపాలు ఉన్నత స్థాయిలోనే ఉంటాయి’’ అని ముక్తాయించారు.
Viral: వీసమెత్తు పనిచేయకుండా లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి! ఇతడి బిజినెస్ ఎంటో తెలిస్తే..
ఇటీవల ఓ అంతర్గత మీటింగ్ సందర్భంగా ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కుదిరితే తాను ఉద్యోగులతో ఆదివారాలు కూడా పనిచేయిస్తానని చెప్పారు. ఇంట్లో రోజంతా భార్యను చూస్తూ ఉండగలరా అని ప్రశ్నించారు. తానూ ఆదివారాలు పనిచేస్తానని అన్నారు. ఇది కాంట్రవర్సీకి దారి తీసింది.
Viral: కలలో కనిపించిన సంఖ్య ప్రకారం లాటరీ టిక్కెట్టు కొన్న మహిళ.. చివరకు ఊహించని విధంగా..