Viral: వామ్మో.. పులి పిల్లల వేట.. షాకింగ్ వీడియో!
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:48 PM
తల్లి పులితో కలిసి పులి పిల్లలు ఓ జింకను వేటాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతోంది. రణతంభోర్ జాతీయ ఉద్యానవనంలో వెలుగు చూసిన ఈ ఘటన నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: వేటాడటంతో సింహానికి ఏమాత్రం తీసిపోని జంతువు పులి. ఒంటరిగా వేటాడే పులి దృష్టి ఏ జంతువు పైన అయినా పడిందంటే ఇక దానికి భూమ్మీద నూకలు చెల్లినట్టే. మాటు వేసి వేటాడటంలో పులికి మించినది లేదంటే అతిశయోక్తి కాదు. పులికి చెట్లు ఎక్కే సామర్థ్యం కూడా ఉండటంతో దీని బారినపడ్డ జంతువు తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సాధారణంగా పులులు ఒంటరిగానే వేటాడతాయి. కానీ కొన్ని అసాధారణ సందర్భాల్లో మాత్రం అవి కలిసి వేటసాగిస్తాయి. సరిగ్గా ఇలాంటి అరుదైన వేటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది (Viral).
రణతంభోర్ జాతీయ ఉద్యానవనంలో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. టీనేజ్ వయసులో ఉన్న పులి పిల్లలు తల్లితో కలిసి ఓ భారీ జింకను వేటాడిన వైనాన్ని కొందరు టూరిస్టులు కెమెరాలో రికార్డు చేసి నెట్టింట పోస్టు చేశారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. పిల్ల పులులు అద్భుత సమన్వయంతో ఓ భారీ జింకను లొంగదీసుకున్న తీరు జనాల్ని ఆశ్చర్యపరుస్తోంది.
Viral: ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న పోర్టర్
పులి పిల్లలు కాస్త బలహీనంగా ఉండటంతో జింక తొలుత నీళ్లల్లోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈలోపు తల్లి పులి దాని పీక పట్టి అదుపు చేసే ప్రయత్నం చేసింది. మరోవైపు పిల్ల పులులు జింకను బలవంతంగా నీళ్లల్లోంచి బయటకు లాక్కొచ్చి అంతమొందించాయి. సఫారీ టూరిస్టులు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. పిల్ల పులులే ఇంత ఫాస్ట్‌గా ఉంటాయా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
Viral: నిత్య యవ్వనం కోసం కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్న మహిళ!
పులి పిల్లలకు పుట్టగానే కంటి చూపు ఉండదు. రెండు నుంచి మూడు వారాల తరువాత అవి కళ్లు తెరవగలుగుతాయి. రెండేళ్ల వరకూ తల్లి వెంటే ఉంటాయి. ఈ సమయంలో వేటాడటం, అడవిలో జీవించడం వంటి విషయాలను తల్లి పులిని చూసి నేర్చుకుంటాయి. ఆ తరువాత తల్లిని విడిచి వెళ్లిపోతాయి. పులుల్లో సైబీరియన్ పులి అతిపెద్దది. ఈ జాతిలోని మగ పులులు 300 కేజీల వరకూ బరువు ఉంటాయి. ఇక సుమాత్రన్ పులులు అత్యంత చిన్నవి. వీటి సగటు బరువు 160 కేజీలు. ఇక భారత్‌లో కనిపించే బెంగాల్ పులుల బరువు 260 కేజీల వరకూ ఉంటుంది.
ఇక రణతంభోర్ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. 1980ల్లో దీన్ని ఏర్పాటు చేశారు. 1973లోనే దీన్ని పులుల సంరక్షణ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు టైగర్‌లో భాగం చేశారు.
Viral: వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్