Share News

LSG vs PBKS: లక్నోతో పంజాబ్ ఢీ.. కొదమసింహాల కొట్లాటలో గెలిచేదెవరు..

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:47 PM

Indian Premier League: వారం వారం ఐపీఎల్ మరింత హీటెక్కుతోంది. ఒకదాన్ని మించి మరో భీకర పోరు జరుగుతున్నాయి. కొన్ని సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ఇవాళ కూడా అలాంటి ఓ సమరమే జరగనుంది.

LSG vs PBKS: లక్నోతో పంజాబ్ ఢీ.. కొదమసింహాల కొట్లాటలో గెలిచేదెవరు..
LSG vs PBKS

రోజులు గడిచేకొద్దీ ఐపీఎల్ కొత్త సీజన్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ప్రతి జట్టు గెలిచి తీరాల్సిందేననే పట్టుదలతో ఆడుతుండటంతో మ్యాచులు ఆఖరి ఓవర్ల వరకు వెళ్తున్నాయి. చాలా వరకు మ్యాచుల్లో చివరి ఓవర్‌లోనే రిజల్ట్స్ తేలుతున్నాయి. ఇవాళ కూడా ఓ నెక్ టు నెక్ ఫైట్‌ జరగనుంది. గెలుపుతో జోష్‌లో ఉన్న లక్నో సూపర్ జియాంట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలో గెలుపెవరిది.. ఈసారి మీసం తిప్పేదెవరో ఇప్పుడు చూద్దాం..


బలాలు

లక్నో: ఈ టీమ్‌కు బ్యాటింగే బలం. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ రూపంలో సాలిడ్ బ్యాటర్లు ఎల్‌ఎస్‌జీ సొంతం. పూరన్-మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పంత్-బదోని ఫామ్ అందుకుంటే ఆ టీమ్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో లార్డ్ శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ అదరగొడుతున్నారు.

పంజాబ్: ఈ జట్టుకు కూడా బ్యాటింగే మెయిన్ స్ట్రెంగ్త్. శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్‌, ప్రభుసిమ్రన్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్‌తో కూడిన పంజాబ్ బ్యాటింగ్‌ను చూస్తే ఎంతటి జట్టయినా షేక్ అవ్వాల్సిందే. అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సన్, యుజ్వేంద్ర చాహల్, వైశాఖ్ విజయ్‌కుమార్‌తో కూడిన బౌలింగ్ విభాగం కూడా బాగుంది.


బలహీనతలు

లక్నో: స్పిన్నర్ రవి బిష్ణోయ్ బ్రేక్‌త్రూలు ఇస్తున్నా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. శార్దూల్ ఫెయిలైతే.. క్రమం తప్పకుండా వికెట్లు తీసే తోపు పేసర్ లేకపోవడం మరో మైనస్. బ్యాటింగ్‌లో కెప్టెన్ పంత్ ఇంకా రిథమ్‌ అందుకోలేదు.

పంజాబ్: ఆల్‌రౌండర్లు ఒమర్జాయి, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ ఇంకా టచ్‌లోకి రాలేదు. ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ కూడా ఫామ్ అందుకోలేదు. బౌలింగ్‌లో మార్కో యాన్సన్ గత మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. చాహల్‌ది కూడా ఇదే వరుస. అతడు వికెట్లు కూడా తీయడం లేదు.


హెడ్ టు హెడ్

ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు మొత్తం 4 మ్యాచులు జరిగాయి. ఇందులో లక్నో మూడుసార్లు విజయం సాధించగా.. పంజాబ్ ఒక్కదాంట్లో గెలుపొందింది.

విన్నింగ్ ప్రిడిక్షన్

ఇరు జట్లు మంచి జోరు మీదున్నాయి. లక్నోకు హోమ్ అడ్వాంటేజ్ ఉంది. ఆ టీమ్‌లో మంచి స్పిన్నర్లు ఉన్నారు. కానీ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మార్చేసే హిట్టర్లు, ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉండటం, టీమ్ భీకర ఫామ్‌లో ఉన్నందున ఇవాళ్టి పోరులో పంజాబ్ విజయకేతనం ఎగురవేయడం ఖాయం.

Updated Date - Apr 01 , 2025 | 03:53 PM