IPL 2025 New Rules Explained: ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క.. గట్టిగా బిగిస్తున్న బీసీసీఐ
ABN , Publish Date - Mar 21 , 2025 | 10:02 AM
IPL 2025 Rule Changes: ఐపీఎల్ 2025లో కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది బీసీసీఐ. అన్ని జట్ల సారథులతో నిన్న నిర్వహించిన కెప్టెన్స్ మీట్‌లో డిస్కస్ చేసి దీనిపై ప్రకటన చేసింది. ఈ నిబంధనలు ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలం అనేది ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ ద్వారా యంగ్‌స్టర్స్‌కు చాన్సులు, లీగ్‌తో భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాదు.. దీన్నో ప్రయోగశాల గానూ వాడుతూ వస్తోంది బీసీసీఐ. ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ప్రవేశపెడుతూ ఆటను భిన్నమైన దృక్కోణంలో చూసేలా అలవాటు చేస్తోంది. ఈసారి కూడా ఎక్స్‌పెరిమెంట్స్ విషయంలో తగ్గేదేలే అంటోంది బోర్డు. ఐపీఎల్-2025 కోసం పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా సెకండ్ బాల్ రూల్ గురించి చర్చలు ఊపందుకున్నాయి. టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో ఒకే బంతిని వాడతారు. కానీ ఐపీఎల్‌లో సెకండ్ బాల్‌ను కూడా ఉపయోగించనున్నారు. ఈ రూల్‌తో బ్యాటర్లకు గట్టిగా బిగిస్తున్నారని.. పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడక తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలేంటీ రూల్.. దీని వల్ల ఎవరికి బెనిఫిట్ అనేది ఇప్పుడు చూద్దాం..
సరికొత్త ఆయుధం
రాత్రి పూట మ్యాచుల్లో ఛేజింగ్ సమయంలో డ్యూ కారణంగా బంతి తడిగా మారడం చూస్తుంటాం. దీని వల్ల బంతి మీద గ్రిప్ కోల్పోవడం బౌలర్లకు బిగ్ చాలెంజ్‌గా ఉంటుంది. దీంతో వీళ్లతో బ్యాటర్లు ఆడుకుంటారు. భారీ స్కోర్లు కూడా ఛేజ్ చేసేస్తుంటారు. దీంతో బంతి-బ్యాట్ మధ్య సమతూకం తీసుకొచ్చేందుకు సెకండ్ బాల్ రూల్ తీసుకొచ్చింది బీసీసీఐ. రెండో ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ తర్వాత బంతి తడిగా మారితే.. అంపైర్ నిర్ణయం మేరకు కొత్త బంతిని తీసుకోవచ్చు. దీని వల్ల బంతి మీద గ్రిప్ దొరికి అటు పేసర్లకు స్వింగ్, ఇటు స్పిన్నర్లకు టర్న్ లభిస్తుంది. దీంతో బౌలర్ల చేతిలో ఓ ఆయుధం దొరికినట్లు అవుతుందనేది బోర్డు ఆలోచన. ఈ కొత్త రూల్ పలు జట్లకు పెద్ద సానుకూలాంశంగా మారనుంది.
ఎవరికి ప్లస్
జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి బంతిని స్వింగ్ చేయగలిగే పేసర్లు ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్‌కు సెకండ్ బాల్ రూల్ బిగ్ ప్లస్ కానుంది. మహ్మద్ సిరాజ్ వంటి సీమ్ బౌలర్, రషీద్ ఖాన్ లాంటి టాప్ స్పిన్నర్ ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా దీని వల్ల బెనిఫిట్ అయ్యే చాన్స్ ఉంది. అర్ష్‌దీప్ సింగ్, రబాడ (పంజాబ్ కింగ్స్) కూడా ఈ కండీషన్స్‌లో అదరగొట్టొచ్చు. జడేజా-అశ్విన్-నూర్ అహ్మద్ రూపంలో సూపర్బ్ స్పిన్ అటాక్ ఉన్న సీఎస్‌కే కూడా సెకండ్ బాల్ వల్ల లాభపడొచ్చు. నరైన్, వరుణ్ చక్రవర్తి కలిగిన కేకేఆర్ కూడా ఈ రూల్‌ను ఆయుధంగా చేసుకొని చేజింగ్ టీమ్‌ను కుప్పకూల్చేందుకు ప్లాన్స్ వేయొచ్చు. పంజాబ్, ముంబై, గుజరాత్, చెన్నై, ఢిల్లీ జట్లు ఈ రూల్ వల్ల చాలా లాభపడే చాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి