Team India: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్.. ఇక కప్పు కష్టమే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:11 AM
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తాకింది. కప్పు ఫైట్‌లో కీలకమైన ఆటగాడు టీమ్‌కు దూరమయ్యాడు. దీంతో ట్రోఫీ ఆశలు గల్లంతేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వన్డే క్రికెట్‌లో రెండో అతిపెద్ద టోర్నమెంట్ అయిన చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. ఈ టోర్నమెంట్‌కు ఇంకో నెల రోజుల కంటే ఎక్కువ టైమ్ లేదు. ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ కోసం ఆతిథ్య పాకిస్థాన్‌లో ఏర్పాట్లు జోరందుకున్నాయి. భారత మ్యాచులకు హోస్ట్‌గా ఉన్న దుబాయ్‌లోనూ మ్యాచులకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు అన్ని దేశాలు ఈ టోర్నీలో పాల్గొనే తమ స్క్వాడ్స్‌ను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ స్క్వాడ్ అనౌన్స్ చేసింది. భారత జట్టుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కోలుకోలేని షాక్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమితో నిరాశలో కూరుకుపోయిన టీమిండియా ఎలాగైనా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మెగాటోర్నీలో అదరగొట్టేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోంది. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న పేస్ యోధుడు మహ్మద్ షమీని కూడా రీఎంట్రీకి రెడీ చేసింది. ఇలా అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అనుకుంటున్న వేళ టీమ్‌కు భారీ షాక్ తగిలిందని తెలుస్తోంది. వెన్నులో వాపుతో బాధపడుతున్న పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇంకా కోలుకోలేదని.. చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచులన్నీ అతడు మిస్ కావొచ్చని సమాచారం.
ఆలస్యానికి అదే కారణం!
బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తోంది. బీసీసీఐ మెడికల్ టీమ్‌తో పాటు ఇతర ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు బుమ్రా. అతడికి సర్జరీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్పీడ్‌స్టర్ ఎప్పటివరకు పూర్తిగా రికవర్ అవుతాడో క్లారిటీ లేదు. అందుకే చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించే విషయంలో భారత క్రికెట్ బోర్డు మల్లగుల్లాలు పడుతోందని సమాచారం. ఈ విషయంలో మరింత సమయం కావాలని ఐసీసీని రిక్వెస్ట్ చేసిందట బీసీసీఐ. ఒకవేళ బుమ్రా మొత్తం టోర్నీకి దూరమైతే అతడి స్థానంలో ఏ ఆటగాడ్ని తీసుకుంటారో చూడాలి.
ఇవీ చదవండి:
‘మెల్‌బోర్న్’తోనే గుడ్ బై చెబుదామనుకున్నాడా!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి