SRH vs LSG Match Prediction: హైదరాబాద్ వర్సెస్ లక్నో.. ఉప్పల్ ఫైట్‌లో గెలిచేదెవరంటే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:35 PM
Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ సెకండ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. లక్నో సూపర్ జియాంట్స్‌తో ఉప్పల్ స్టేడియం వేదికగా తాడోపేడో తేల్చుకోనుంది కమిన్స్ సేన.

ఐపీఎల్ నయా ఎడిషన్‌లో మోస్ట్ ఎగ్జయిటెడ్ మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జియాంట్స్ మధ్య పోరుకు సర్వం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలవడంతో పాటు ఓ మిషన్‌ను కూడా పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 300 పరుగుల మార్క్‌ను అందుకోవాలని అంటున్నారు. ఎల్ఎస్‌జీపై భీకరంగా ఆడే కమిన్స్ సేన.. ఇవాళ్టి పోరును వన్‌సైడ్ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి, రికార్డులు ఏం అంటున్నాయి.. ఎవరు నెగ్గే చాన్సులు ఉన్నాయనేది చూద్దాం..
బలాలు
సన్‌రైజర్స్: హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసెన్, నితీష్ రెడ్డి లాంటి టాప్ క్లాస్ బ్యాటింగ్ ఫైర్ పవర్ ఉండటమే ఆరెంజ్ ఆర్మీ ప్రధాన బలం. నీళ్లు తాగినంత ఈజీగా 250 ప్లస్ స్కోర్లు బాదేయడం ఎస్‌ఆర్‌హెచ్‌కు అలవాటైన సంప్రదాయం. టీమ్‌లో కొత్తగా వచ్చిన కాటేరమ్మ చిన్న కొడుకు ఇషాన్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లూ మంచి ఊపు మీద ఉన్నారు. బౌలింగ్‌లో కాస్త రన్స్ లీక్ అవుతున్నా తమదైన రోజున సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పే షమి, జంపా, కమిన్స్ లాంటి బౌలర్లు జట్టులో ఉండటం అదనపు బలం.
లక్నో: పంత్, పూరన్, మార్ష్, మిల్లర్, మార్క్రమ్‌తో లక్నో బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. వీళ్లు క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్లు చేయగలరు. శార్దూల్ ఠాకూర్, షాబాజ్ రూపంలో మంచి ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. బిష్ణోయ్ వంటి క్వాలిటీ స్పిన్నర్ ఉండటం లక్నోకు అదనపు బలం.
బలహీనతలు
సన్‌రైజర్స్: టాప్ టు మిడిలార్డర్ వరకు సాలిడ్ బ్యాటింగ్ యూనిట్ ఉన్నా.. ఆఖర్లో ఫినిషింగ్ చేసే వాళ్లు లేరు. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ లాంటి కుర్రాళ్లు ఎంతమేరకు రాణిస్తారో చెప్పలేని పరిస్థితి. బౌలింగ్ యూనిట్ బాగానే ఉన్నా రాజస్థాన్‌తో మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకోవడం ఇబ్బందే అని చెప్పాలి.
లక్నో: కెప్టెన్ పంత్ ఫామ్‌ను ఇంకా అందుకోలేదు. బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్ యూనిట్‌తో బిగ్ ప్రాబ్లమ్స్ తప్పేలా లేవు. బిష్ణోయ్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ కూడా ఎక్స్‌పెన్సివ్‌గా నిలుస్తూ టీమ్‌కు మైనస్‌గా మారుతున్నారు.
హెడ్ టు హెడ్
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 3 మ్యాచులు జరగ్గా.. అందులో 2 సార్లు లక్నో నెగ్గింది. కానీ గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చేతుల్లో ఆ టీమ్ చిత్తయింది. ఎల్‌ఎస్‌జీ సంధించిన 166 టార్గెట్‌ను 9.4 ఓవర్లలోనే కొట్టిపారేసింది ఆరెంజ్ ఆర్మీ. అందుకే సన్‌రైజర్స్‌ను చూస్తేనే లక్నో ఆటగాళ్లు భయపడుతున్నారు.
మ్యాచ్ అంచనా
బలమైన బ్యాటింగ్, హోమ్ అడ్వాంటేజ్, బ్యాలెన్స్‌డ్ బౌలింగ్ అటాక్, బలాబలాలు, రికార్డులు.. ఇలా ఏది చూసుకున్నా ఇవాళ్టి పోరులో సన్‌రైజర్స్ గెలుపు ఖాయం. అయితే కమిన్స్ సేన 300 రన్స్ మార్క్‌ను అందుకుంటుందా.. ఎంతటి భారీ తేడాతో ఘనవిజయం సాధిస్తుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇవీ చదవండి:
ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ లక్నో.. ప్లేయింగ్ 11 ఇదే..
పాయింట్స్ టేబుల్‌లో ఊహించని ట్విస్ట్
24 గంటల్లో మూడుసార్లు 97 నాటౌట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి