Jasprit Bumrah: ఒక్కడికి వణికిన 15 మంది.. ఆసీస్‌కు నిద్రలేని రాత్రులు
ABN , Publish Date - Jan 05 , 2025 | 03:05 PM
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారూలు కైవసం చేసుకున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో ఎగరేసుకుపోయారు. అయితే ఆతిథ్య జట్టును ఓ ప్లేయర్ మాత్రం నిద్రలేకుండా చేశాడు.
భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ముగిసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కంగారూలు కైవసం చేసుకున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1తో ఎగరేసుకుపోయారు. 10 ఏళ్ల నుంచి ఈ ట్రోఫీని కాపాడుకుంటూ వచ్చిన మెన్ ఇన్ బ్లూ.. చెత్తాటతో దాన్ని కోల్పోయింది. సిరీస్ ఆసాంతం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన ఆసీస్.. అన్ని విభాగాల్లోనూ భారత్‌ను డామినేట్ చేసింది. ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి టీమిండియా దాని నుంచి బయటపడకపోవడం, కంగారూలు తట్టుకోవడంతో రిజల్ట్ ఆ టీమ్ సైడ్ వెళ్లిపోయింది. అయితే కమిన్స్ సేన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నా ఇప్పటికీ అతడ్ని తలచుకొని భయపడుతోంది. ఆ జట్టుకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆ యోధుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
బౌలింగ్‌కు దిగకపోవడంతో..
బీజీటీలో ఆడిన ఐదు టెస్టుల్లో కలిపి తీసిన వికెట్లు 32. హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న బౌలర్. భారత్ గెలిచిన పెర్త్ టెస్ట్ సహా డ్రా చేసుకున్న మ్యాచ్‌లోనూ అతడు నిప్పులు చెరిగే బంతులతో అదరగొట్టాడు. ఓడిన మ్యాచుల్లోనూ అతడు ఒంటరి పోరాటం చేశాడు. కంగారూ పిచ్‌ల మీద ఏళ్లుగా ఆడుతున్న ఆటగాడి మాదిరిగా, అది తన సొంత వికెట్ అనే రీతిలో చెలరేగి బౌలింగ్ చేశాడు. నిఖార్సయిన పేస్, రాకాసి బౌన్సర్లు, మైండ్‌బ్లోయింగ్ స్వింగర్లతో కంగారూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిన ఆ బౌలరే జస్‌ప్రీత్ బుమ్రా. అయితే ఇంత చేసినోడు గాయం కారణంగా ఆఖరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగలేదు. దీంతో ఆసీస్‌ను భారత బౌలర్లు ఆపలేకపోయారు. 162 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఆడుతూ పాడుతూ ఛేదించింది. బుమ్రా లేకపోవడం వల్లే తమ విక్టరీ సాధ్యమైందని స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అంటున్నాడు.
కథలు కథలుగా చెబుతాం!
బుమ్రా తమకు పీడకలలు మిగిల్చాడని హెడ్ చెప్పాడు. ఈ సిరీస్‌లో అతడి బౌలింగ్ అద్భుతమని.. అలాంటి బౌలర్‌ను ఎదుర్కొన్నామని భవిష్యత్తులో తమ మనవళ్లకు కథలుగా చెప్పుకుంటామంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. సిడ్నీ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌కు రావడం లేదని విషయం తెలిసి తమ డ్రెస్సింగ్ రూమ్ సంతోషంలో మునిగిపోయిందన్నాడు. తమ టీమ్‌లోని 15 మందికీ అతడంటే వణుకు అని.. ఆడటం లేదని తెలియగానే ఫుల్ హ్యాపీ అయ్యామన్నాడు. భారత యంగ్ ఓపెనర్ జైస్వాల్ మీద అతడు ప్రశంసల జల్లులు కురిపించాడు. ఈ టూర్‌లో అతడు చాలా బాగా ఆడాడని మెచ్చుకున్నాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి టాలెంట్ ఏంటనేది తనకు తెలుసునన్నాడు. ఈ యంగ్‌స్టర్స్ సత్తా చాటారన్నాడు హెడ్.