కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?
ABN , Publish Date - Jan 24 , 2025 | 03:48 AM
అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మూత్రపిండాల మార్పిడికి శస్త్రచికిత్సలు జరిగిందెక్కడ? దాతల నుంచి కిడ్నీలు తీసుకున్న చోటే.. స్వీకర్తలకు వాటిని అమర్చారా?

రష్యా, ఉక్రెయిన్ వైద్యులకు దందాతో లింకులు!
కిడ్నీ రాకెట్ మూలాలపై దృష్టి
వైద్యుల కోసం 10 బృందాల గాలింపు
కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షల ఒప్పందం
వెల్లడించిన కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్
పోలీసుల అదుపులో ఎనిమిది మంది..!
దిల్‌సుఖ్‌నగర్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మూత్రపిండాల మార్పిడికి శస్త్రచికిత్సలు జరిగిందెక్కడ? దాతల నుంచి కిడ్నీలు తీసుకున్న చోటే.. స్వీకర్తలకు వాటిని అమర్చారా? మరో ఆస్పత్రిలో సర్జరీలు చేసి, రోగుల తదనంతర చికిత్సలకు అలకనంద ఆస్పత్రికి తరలించారా? ఈ ప్రశ్నల చిక్కుముళ్లను విప్పేందుకు ఉస్మానియా ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ కసరత్తు చేస్తోంది. భారతీయ చట్టాలు.. ముఖ్యంగా అవయవమార్పిడి చట్టంపై అవగాహన ఉండే దేశీయ వైద్యులకు.. ఈ తరహా దందాల్లో పాలుపంచుకుంటే.. భారత వైద్య మండలి(ఎంసీఐ) లైసెన్సును రద్దు చేస్తుందని తెలుసు. ఈ నేపథ్యంలో కమిటీ విదేశీ వైద్యుల వ్యవహారంపై దృష్టిసారించింది. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా అలకనంద ఆస్పత్రి వెబ్‌సైట్‌లో యజమానుల వివరాలు ఉండడంతో.. కమిటీ ఈ అంశంపై ఫోకస్ చేస్తోంది.
రష్యా, ఉక్రెయిన్ వైద్యులు
అలకనంద కిడ్నీరాకెట్‌కు రష్యా, ఉక్రెయిన్‌తో సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రి యజమాని డాక్టర్ సుమంత్ రష్యాలో ఎంబీబీఎస్ చేశారు. అక్కడి యూరాలజిస్టులతో తనకున్న సంబంధాలతో.. వారిని ఇక్కడికి పిలిపించి మూత్రపిండాల మార్పిడి సర్జరీలు చేయిస్తున్నట్లు తెలిసింది. అలకనంద వెబ్‌సైట్‌లో డాక్టర్ సుమంత్‌తోపాటు.. ముగ్గురు విదేశీ వైద్యులను ‘హెడ్ ఆఫ్ అలకనంద ఆస్పత్రి’గా పేర్కొన్నారు. ఆ ముగ్గురు విదేశీ వైద్యులు నిజంగానే ఆస్పత్రిలో భాగస్వాములా? లేక.. సుమంత్ వారి ఫొటోలను అలా వాడుకున్నారా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ వారు నిజంగానే ఆస్పత్రి భాగస్వాములైతే.. భారత్‌లో సర్జరీలు చేస్తున్నారా? అందుకు ఎంసీఐ లైసెన్సు తీసుకున్నారా? అనేవి ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన వైద్యులను రప్పించి, వారితో సర్జరీలు చేయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నల్లగొండ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్‌లోనూ.. దాతలు, స్వీకర్తలను తమిళనాడు, కర్ణాటక మీదుగా శ్రీలంకకు తరలించి, అక్కడ మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన విషయం తెలిసిందే..! ఈ కేసులోనూ విదేశీ లింకులున్నట్లు కమిటీ భావిస్తోంది.
సర్జరీలు జరిగిందెక్కడ?
అలకనంద ఆస్పత్రికి తొమ్మిది పడకలకే అనుమతి ఉంది. ఆ ఆస్పత్రిలో చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీలు, సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు అనువైన ఆపరేషన్ థియేటర్ మాత్రమే ఉంది. అలాంటి చోట అవయవమార్పిడి నిర్వహించడం సాధ్యం కాదని యూరాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఇలాంటి సర్జరీలకు అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ థియేటర్ సెటప్ ఉండాలి. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల సమయంలో ఇద్దరు యూరాలజిస్టులతోపాటు.. సహాయకుడిగా నెఫ్రాలజిస్టు, అనస్థీషియా నిపుణుడు/బృందం, జనరల్ ఫిజిషియన్, వాస్కులర్ సర్జన్, అత్యుత్తమ శిక్షణ పొందిన హెడ్ నర్స్, నర్సుల బృందం, అవసరాన్ని బట్టి కార్డియాలజిస్ట్ అవసరం ఉంటుంది’’ అని వివరిస్తున్నారు. దీంతో.. అలకనందలో మూత్రపిండాల మార్పిడికి అవకాశాల్లేవని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వేరే ఆస్పత్రిలో సర్జరీలు చేసి, శస్త్రచికిత్స తదనంతర పర్యవేక్షణకు కిడ్నీ దాతలు, స్వీకర్తలను అలకనందకు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సర్జరీలు ఎక్కడ జరిగాయన్న విషయం తెలియాలంటే.. ప్రధాన నిందితుడు సుమంత్ నోరు విప్పాల్సిందేనని కమిటీ, పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అనుమతులకు మించి సేవలు
తొమ్మిది పడకలున్న అలకనంద ఆస్పత్రికి ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్ విభాగాల నిర్వహణకు మాత్రమే అనుమతి ఉందని రంగారెడ్డి జిల్లా డీఎంఎహెచ్‌వో వెంకటేశ్వరరావు ఇదివరకే చెప్పారు. అయితే.. అలకనంద వెబ్‌సైట్‌లో మాత్రం రేడియాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, వాస్కులర్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గ్యాస్ర్టో ఎంట్రాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, రెహమటాలజీ, పెడియాట్రిక్స్, డెర్మటాలజీ విభాగాల్లో వైద్యసేవలు లభిస్తాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
కిడ్నీ మార్పిడికి రూ.50 లక్షలు
అలకనంద కిడ్నీ రాకెట్ ముఠా మూత్రపిండాల మార్పిడికి అవసరార్థుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేస్తున్నట్లు విచారణ కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్ మీడియాకు చెప్పారు. కిడ్నీలు విఫలమై.. దాతల కోసం వెతుకుతున్న ధనికులను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్‌ఎంపీ డాక్టర్లను ఏజెంట్లుగా నియమించుకున్న విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. స్వీకర్తల నుంచి అక్షరాలా అరకోటి వసూలు చేస్తున్న ఈ ముఠా.. దాతలకు మాత్రం రూ.4 లక్షలు ఇచ్చి, చేతులు దులుపుకొంటుండడం గమనార్హం..! కాగా.. ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వీరిలో ఆస్పత్రి యజమాని సుమంత్‌తోపాటు.. ఏజెంట్లు ఉన్నారు. ఆస్పత్రిలో దాడుల సమయంలో పరారైన వైద్యులను గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు రాచకొండ పోలీసులు 10 బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.