Share News

Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:31 AM

పుష్ప2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ దగ్గర డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి

Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు

ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు

తొక్కిసలాట కేసులో కోర్టు ఆదేశం

హైదరాబాద్‌, జనవరి3(ఆంధ్రజ్యోతి): పుష్ప2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ దగ్గర డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్‌ పిటిషన్‌పై గత నెల 30వ తేదీన వాదనలు పూర్తి కాగా శుక్రవారం ఈ పిటిషన్‌పై నాంపల్లిలోని రెండో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు అదనపు న్యాయమూర్తి వినోద్‌ కుమార్‌ తీర్పును వెల్లడించారు. ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఉండగా తాజాగా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్‌ ఇచ్చింది. హత్య, హత్యకు సూత్రధారిగా అల్లు అర్జున్‌పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వర్తించవంటూ తాము చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్‌ మంజూరు చేసిందని ఆయన తరపు న్యాయవాది అశోక్‌ రెడ్డి తెలిపారు.


పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాల ప్రకారం ఈ కేసులో అల్లు అర్జున్‌పై మోపిన బీఎన్‌ఎ్‌సలోని 105వ సెక్షన్‌ వర్తించదంటూ తాము వినిపించిన వాదనలను కోర్టు విశ్వసించిందని ఆయన చెప్పారు. కాగా, పోలీసులు పూర్తి చార్జిషీట్‌ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు అల్లు అర్జున్‌ ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలిపింది. రూ.50 వేల విలువ గల రెండు పూచీకత్తులు సమర్పించాలని షరతుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను, ఘటనతో సంబంధమున్న సాక్షులను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్‌కు సూచించింది.

Updated Date - Jan 04 , 2025 | 05:31 AM