Share News

Hyderabad: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి!

ABN , Publish Date - Feb 20 , 2025 | 06:28 AM

పరీక్షల్లో రోస్టర్‌ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేశారు.

Hyderabad: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి!

  • ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థుల డిమాండ్‌

  • హైదరాబాద్‌లో ధర్నాకు దిగిన అభ్యర్థులు

హైదరాబాద్‌(కవాడిగూడ), ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షల్లో రోస్టర్‌ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో గ్రూప్‌-2 అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. దాదాపు వంద మందికిపైగా అభ్యర్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ, గ్రూప్‌-2 మెయిన్స్‌లోని రోస్టర్‌ విధానంలో లోపాలు ఉన్నాయని, వీటిని సరిచేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీ వెంటనే స్పందించి తప్పులను సరిదిద్దడానికి కమిటీ వేయాలని కోరారు. రోస్టర్‌ విధానంలోని లోపాల కారణంగా జార్ఖండ్‌ రాష్ట్రంలో ఉద్యోగంలో చేరిన పదేళ్ల తర్వాత వారిని తొలగించారని తెలిపారు. అదే పద్ధతిని ఏపీలో కొనసాగించడంతో గ్రూప్‌-2 అభ్యర్థుల్లో గందరగోళం నెలకొందని, ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కాగా, ఈ విషయం తెలిసి దోమలగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. అనుమతి లేకుండా ధర్నా ఎలా చేస్తారని విద్యార్థులను ప్రశ్నించారు. దీంతో నిరసనలో పాల్గొన్న అభ్యర్థులు ఎన్‌టీఆర్‌ స్టేడియం నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Feb 20 , 2025 | 06:28 AM