Bhogi: కో.. అంటే కోట్లు!
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:45 AM
తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది.
ఏపీలో గోదారి, పలు జిల్లాల్లో కోడిపందేల జోరు
300 కోట్ల పందేలు.. కొందరికి బుల్లెట్ల కానుకలు
లక్షలాదిగా జనం.. కత్తులు కట్టే వారికి డిమాండ్
పందెం రాయుళ్ల జోష్.. పోలీసుల కట్టడి పైపైనే!
కత్తులు దూసిన కోళ్లు... పందెం రాయుళ్ల హుషారుతో పల్లెలు చిందులేశాయి! గోదావరి జిల్లాల నుంచి కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వెలిసిన బరులు కోళ్ల యుద్ధానికి వేదికలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన పండుగలో తొలిరోజు భోగినాడే సుమారు రూ.300 కోట్ల మేరకు కరెన్సీ కట్టలు పందేలొడ్డాయి. గుండాట, లోనబయట, పేకాటలతో ‘భోగి’ సాగిపోయింది!!కత్తులు దూసిన కోళ్లు... పందెం రాయుళ్ల హుషారుతో పల్లెలు చిందులేశాయి! గోదావరి జిల్లాల నుంచి కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వెలిసిన బరులు కోళ్ల యుద్ధానికి వేదికలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన పండుగలో తొలిరోజు భోగినాడే సుమారు రూ.300 కోట్ల మేరకు కరెన్సీ కట్టలు పందేలొడ్డాయి. గుండాట, లోనబయట, పేకాటలతో ‘భోగి’ సాగిపోయింది!!
(ఆంధ్రజ్యోతి నూస్‌నెట్‌వర్క్): తెలుగు వారి అతి పెద్ద మూడు రోజుల పండుగ సంక్రాంతిలో తొలిరోజైన సోమవారం భోగి.. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు, చిందులతో వైభోగంగా సాగిపోయింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనూ కోడి పందేలు జోరుగా సాగాయి. మూడు రోజుల పండుగలో తొలిరోజే సుమారు రూ.300కోట్ల మేరకు పందెం రాయుళ్లు పందేలొడ్డడం గమనార్హం. గోదావరి జిల్లాల్లో వేసిన భారీ బరులను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పలు బరుల్లో పలువురు ప్రజాప్రతినిధులు సైతం సందడి చేశారు.
ఉమ్మడి, తూర్పు పశ్చిమలో ఉత్సాహంగా..
పశ్చిమగోదావరి జిల్లాలో రూ.కోట్లు చేతులు మారాయి. భీమవరం, ఉండి మండలాల్లో ఒక్కొక్క కోడి పందెం రూ.5 లక్షల వరకు వెళ్లింది. జిల్లా వ్యాప్తంగా భోగి పండుగ రోజే పందెం రాయుళ్లు రూ.100 కోట్ల వరకు పందేలు కాసినట్టు అంచనా. తాడేపల్లిగూడెంలో ముసుగు పందెం రూ.25 లక్షల వరకు పలికింది. ముసుగు పందెం అంటే ముందుగా కోళ్లను చూపించరు. పందెం ఖరారైన తర్వాత కోళ్లను బరిలోకి దింపుతారు. హాస్య నటుడు కృష్ణ భగవాన్ పోటీలను ఆసక్తిగా తిలకించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పందేల జాతర ఘనంగా జరిగింది. తొలిరోజు కోడిపందాలు, గుండాట, కోతాటతో కలిపి రూ.175 కోట్లకుపైగా వ్యాపారం సాగినట్టు సమాచారం. కోనసీమ జిల్లాలో 430 బరుల్లో పందేలు సాగాయి. కోడి పందేలు భారీ స్థాయిలో జరిగిన ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఏకంగా రూ.5 కోట్లు దాటినట్టు తెలిసింది. కడప జిల్లా పులివెందులలో తొలిసారి కోడిపందేల జోరు కనిపించింది. పందేల్లో తొలిరోజే రూ.2కోట్లు దాటినట్లు సమాచారం. ప్రకాశం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కోడి పందేలు సాగాయి.
పందేలు-పదనిసలు!
తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సతీశ్ తొమ్మిది పందేల్లో పాల్గొని ఆరు గెలిచి, బుల్లెట్‌ను సొంతం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో బైక్‌లు, పసిడి నాణేల ఆఫర్లు పందెం రాయుళ్లను ఆకట్టుకున్నాయి.
యలమంచిలి, వీరవాసరం మండలం నవుడూరులో విందు భోజనాలు ఏర్పాటు చేశారు.
కాకినాడలోని కరప మండలంలో రూ.36 లక్షలతో బరి గెలుచుకున్న ఓ నిర్వాహుకుడు తొలిరోజు రూ.10 కోట్లకుపైగా పందేలు నిర్వహించారు.
బరుల వద్ద తక్షణం అప్పులు ఇచ్చేందుకు ఫైనాన్స్ వ్యాపారులు నోట్ల కట్టలతో కనిపించారు.
పిఠాపురంలో 60 చోట్ల పందేలు జరిగాయి. టీడీపీ, జనసేన నేతలు బరులు నిర్వహించారు.
ఏలూరు జిల్లాలో కోడి పందేల్లో పాల్గొన్న వారికి బిర్యానీ ఇచ్చేందుకు పాస్‌లు జారీ చేశారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో కోళ్లను వాటి యజమానులు ముద్దాడే ఫోటోలతో ‘మా సంక్రాంతి చాంపియన్’ అంటూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కృష్ణాజిల్లాలో చీకోటి ప్రవీణ్ అనుచరులు క్యాసినోను రహస్యంగా నిర్వహించారు.
ఫ్లడ్ లైట్ల వెలుగులో రేయింబవళ్లు జరిగే పందేలను ప్రత్యేక డ్రోన్లు, అత్యాధునిక సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
470 రకాల వంటలతో విందు
యానాంలో కొత్త అల్లుడికి అత్తింటివారు 470రకాల వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. యానాం వ్యాపారి మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వర్, వెంకటేశ్వరి దంపతులు తమ అల్లుడు సాకేత్‌ను ఇంటికి ఆహ్వానించి.. ఈ విధంగా విందు ఇచ్చారు.