Share News

Sridhar Babu: ‘పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌’ కోసం బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ చేసింది

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:32 AM

సభలో పలుమార్లు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లారు. అయితే సీఎం మాట్లాడేటప్పుడు కాకుండా, అంతా అయిపోయిన తర్వాత పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అడగడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: ‘పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌’ కోసం బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ చేసింది

  • ముఖ్యమంత్రి ఎక్కడా కోర్టు పేరు తీయలేదు: శ్రీధర్‌బాబు

  • చట్టసభలో ఏ అంశంపైనైనా మాట్లాడే అవకాశముంటుంది: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన అంశంపై ‘పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌’కు అనుమతించాలంటూ బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టారు. సభలో పలుమార్లు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లారు. అయితే సీఎం మాట్లాడేటప్పుడు కాకుండా, అంతా అయిపోయిన తర్వాత పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ అడగడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులే న్యాయస్థానాలను కించపరిచే విధంగా మాట్లాడారని, సీఎం మాట్లాడేటప్పుడు ఎక్కడా కోర్టు పేరు తీయలేదని తెలిపారు. కాగా, పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై ప్రతిపక్షం పట్టుబట్టడం సరికాదని అధికారపక్ష నేతలు చెప్పడంతో సభలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.


దీంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కల్పించుకుంటూ.. పార్లమెంట్‌లో సభ్యులు ఏ అంశంపై మాట్లాడేందుకైనా అనుమతిస్తారని చెప్పారు. అయితే పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌కు స్పీకర్‌ అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి తిరిగి సభలోకి వచ్చారు. అనంతరం ఒక్కసారి తనకు మైక్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ సభ్యుడు గంగుల కమలాకర్‌ స్పీకర్‌ను కోరారు. తమకు మైక్‌ ఇవ్వకపోతే.. రేపటి నుంచి తామే సొంతంగా మైక్‌ తెచ్చుకుంటామన్నారు. కొద్దిసేపటి తర్వాత గంగుల మాట్లాడేందుకు స్పీకర్‌ అనుమతించారు.

Updated Date - Mar 27 , 2025 | 03:32 AM