Game Changer: అసెంబ్లీలో చెప్పింది ఒట్టిదేనా.. సీఎంపై హరీష్ రావు ఫైర్..
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:48 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం తీరు చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందన్నారు. గేమ్ చేంజర్ సినిమా అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడంపై..
హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం తీరు చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందన్నారు. గేమ్ చేంజర్ సినిమా అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడంపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. ‘ఒక మహిళ మృతి చెందారు. ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రెడ్డి.. రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు’ అంటూ విమర్శలు గుప్పించారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయన్నారు.
అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా? అని హరీష్ రావు ప్రకటించారు. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోస్‌కి అనుమతి ఇవ్వడం సభను అవమానించడమేనని అన్నారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని హరీష్ రావు ప్రకటించారు. మాట తప్పం, మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సూటిగా ప్రకటించారు.
ఈ పాపం ప్రభుత్వానిదే..
‘గతంలో మీరు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందారు. మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పాపం మీ ప్రభుత్వానిదే కదా రేవంత్ రెడ్డి. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూ టర్న్ తీసుకున్నారు. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి’ అని హరీష్ రావు ప్రశ్నించారు.
Also Read:
పోలీసుల అతి.. కిందపడ్డ జనసేన నేత
బస్సు టికెట్ ధరకే విమాన ప్రయాణం..
For More Telangana News and Telugu News..