Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్
ABN , Publish Date - Jan 12 , 2025 | 06:40 PM
Harish Rao: తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు లేవని ఆరోపించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట, జనవరి 12: రాష్ట్రంలో దాడుల సంస్కృతి మార లేదని.. వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి పాలన పెట్టడం ద్వారా తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడాలని కేంద్రానికి ఆయన సూచించారు. తెలంగాణలో మతకలహాలు సైతం పెరిగాయని.. క్రైమ్ రేట్ 23 శాతం మేర పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు విలేకర్లతో మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రశ్నించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమంలో విఫలమైన రేవంత్ రెడ్డి.. హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదద్రిలో దాడులు చేస్తున్న వారిని పోలీసులే ప్రోత్సహిస్తున్న ట్లు కనిపిస్తుందన్నారు. హోం మంత్రి పదవిని సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారని.. మరి అలాంటి వేళ.. ఇలా హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని సందేహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసాలతోపాటు బీఆర్ఎస్, బీజేపీ కార్యాలయాలపై కాంగ్రెస్ గుండాలు దాడులు చేశారని ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం.. ఈ దాడులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు. రాగద్వేషాలకు అతీతంగా పాలిస్తానని ప్రమాణం చేసి.. అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై హరీష్ రావు ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు.
ఇక కాంగ్రెస్ పార్టీ గుండాలు బరితెగించి దాడులు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే రాజకీయ ప్రయోజనాలే రేవంత్ రెడ్డికి ముఖ్యమయ్యాయన్నారు. రాష్ట్రం రావణకాష్ఠంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓపికను బలహీనంగా తీసుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం మంచిది కాదంటూ సీఎం రేవంత్‌కి హితవు పలికారు. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి.. విపక్ష నేతల అరెస్టు కోసమే పోలీసుల్ని వినియోగిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చర్యలను ఆయన తప్పు పట్టారు.
Also Read: ప్రయాణికులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే
రైతులను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. అలాంటి ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా రైతులను సంక్రాంతి సంబరాలు చేసుకోమంటున్నారని ఎద్దేవా చేశారు. గ్రామాలకు వస్తే రైతులు నిలదీస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకుందా? అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డికి ఈ సందర్బంగా హరీష్‌రావు సవాల్ విసిరారు.
Also Read: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా చెప్పుకొంటుంది
ఏటా ఎకరానికి రూ. 9 వేలు చొప్పున ఈ రైతులను ప్రభుత్వం మంచుతోందని గుర్తు చేశారు. వానాకాలం గుండు సున్నా.. యాసంగికి తట్టి వేస్తున్నారన్నారు. ఊళ్లలోకి వస్తే.. ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఈ సందర్భంగా ప్రజలకు హరీష్ రావు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. ఏడాదికి మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న ఇదే రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ఒక్క పంటకు కూడా సరిగ్గా ఈ పథకాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు.
Also Read: నారా వారి పల్లెకు సీఎం చంద్రబాబు.. అయితే
అలాగే కౌలు రైతులకు సైతం ఇవ్వడం లేదని.. కానీ ఎన్నికలకు ముందు నోరు పెంచి మరి అరిచారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. రూ.15 వేలు ఇస్తానని రూ.9 వేలు ఎగ్గొట్టి... కేవలం రూ.6 వేలు మాత్రమే వారికి ఇస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే.. కేవలం పది లక్షల మందికి మాత్రమే ఉపాధి అంటున్నారని విమర్శించారు. ఉపాధిలో 90 లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఒక ఎకరం భూమి ఉన్న వారిని సైతం రైతులుగా గుర్తించి వారికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. భూమి ఉన్నోళ్లుకు నష్టం.. భూమి లేనోళ్ళకు లాభం కలిగించేలా ఈ సర్కారు చర్యలు ఉన్నాయని ఆయన వ్యంగ్యగా అన్నారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టి పనికి వెళ్లే వారికి నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపాదనలు చేసేటప్పుడు కనీస సోయి కూడా లేకుండా పోయిందన్నారు. మెడ మీద తలకాయ ఉన్నోళ్ళు ఇట్లా చేస్తారా..? అంటూ హరీష్ రావు సందేహం వ్యక్తం చేశారు. మట్టి పనికి పొయెటోల్లంతా కూలీలే.. వారందరికీ వ్యవసాయ కూలీగా గుర్తించి.. వారికి సైతం రైతు భరోసా ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.
నాడు ఎన్నికల ప్రచారంలో కనబడ్డ దేవుళ్లందరి మీద ఒట్టు పెట్టి రైతు రుణ మాఫీ అన్నారని.. ఏడాది గడిచినా ఇంత వరకు రైతు రుణ మాఫీ మాత్రం చేయలేదన్నారు. బుకాయింపులు మాని ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. గుండాలతో కొట్టించుడో.. చిల్లరగాళ్లతో తిట్టించుడు మానండంటూ కాంగ్రెస్ నేతలకు ఆయన హితవు పలికారు.
అడుగడుగునా దగా.. రైతుల్ని సైతం నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటలు కూడా తప్పుతోన్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. పది పంటలకు బీమా అని చెప్పి ఒక్క పంటకే ఇచ్చారని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా రైతులు తిడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
For Telangana News And Telugu News