BRS: జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్‌ఎస్ నిరసనలు
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:41 AM
అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినదించారు.

మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు
పాలన చేతకాక ప్రతిపక్షం గొంతునొక్కాలని కుట్రలు
రేవంత్‌కు మూడు చెరువుల నీళ్లు తాగిపిస్తాం: కేటీఆర్
ప్రజలకు ఏ ఆపదొచ్చినా అండగా బీఆర్‌ఎస్: హరీశ్
హైదరాబాద్/హైదరాబాద్‌సిటీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికమని నినదించారు. ఈ సందర్భంగా నిరసనలు చేపట్టిన బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు చూపిన సమరోత్సాహం.. రాష్ట్ర నాయకత్వానికి కొండంత స్ఫూర్తినిచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ కార్యకర్తలు పిడికిలి బిగించిన తీరు అభినందనీయమన్నారు. పరిపాలన చేతకాక అసెంబ్లీలో బీఆర్‌ఎస్ గొంతు నొక్కాలని చూస్తున్న సీఎంకు ప్రజలపక్షాన తప్పకుండా మూడు చెరువుల నీళ్లు తాపిస్తామని అన్నారు. ఆరు గ్యారంటీలతో ఆగం చేసి, 420 హమీలతో మఽభ్యపెట్టి తెలంగాణను దివాలా దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కారు పాపం పండిందని స్పష్టం చేశారు. ఓ వైపు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్లు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే నీచ సంస్కృతికి రేవంత్ తెరలేపారన్నారు. సీఎం హోదాలో ఉండి బీజేపీ నేతలతో చీకటి మీటింగులేంటి? అని ప్రశ్నించారు.
కాంగ్రె్‌సలో బీజేపీ కోవర్టులు ఉన్నారంటున్న రాహుల్ గాంధీకి, రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్‌రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉందా? అని నిలదీశారు. కాగా, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పేట్‌బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అనుచరుడు జైసింహ, ఉస్మానియా వర్సిటీ పీఎ్‌సలో బీఆర్‌ఎ్‌సవీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఇఫ్లూ వర్సిటీ సర్కిల్ వద్ద బీఆర్‌ఎ్‌సవీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా, ఓర్పులేని వాళ్లు మార్పు ఎలా తెస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? అని నిలదీశారు. ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎప్పుడు ఏ ఆపదొచ్చినా బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. స్పీకర్‌ను జగదీశ్‌రెడ్డి అవమానించలేదని, ఆయనపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని శ్రీనివా్‌సగౌడ్ డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఉద్రిక్తత
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్ నిరసన సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణ తల్లి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసేందుకు గుమిగూడిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోగా.. వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో హోలీ సంబరాల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు రోడ్డు పైకి రావడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనంచేశారు. దీంతో తెలంగాణ చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. దిష్టిబొమ్మలపై నీళ్లు పోసి.. బీఆర్‌ఎస్ నేతలను అక్కడి నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది.