Online Betting: ముదిరిన బెట్టింగ్ వ్యవహారం.. తారలపై కేసులు
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:58 AM
ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినో యాప్‌ల ప్రచారానికి సంబంధించి.. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి, అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపై ఎఫ్‌ఐఆర్
బెట్టింగ్, జూదం, క్యాసినో యాప్స్‌ను ప్రమోట్
చేస్తున్నారంటూ మియాపూర్‌వాసి ఫిర్యాదు
విష్ణుప్రియ, రీతూచౌదరిని ప్రశ్నించిన పంజగుట్ట పోలీసులు
41 సీఆర్పీసీ నోటీసులు జారీ.. మళ్లీ 25న రావాలని ఆదేశం
తెలియక చేశా.. తప్పు తెలుసుకుని ఆపేశా: ప్రకాశ్‌రాజ్
నైపుణ్య ఆధారిత ఆటలకే విజయ్ దేవరకొండ
ప్రచారం చేశారని ఆయన బృందం స్పష్టీకరణ
చట్టబద్ధమైన యాప్‌లకే ప్రమోషన్: రానా టీమ్ వివరణ
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తే చర్యలు: ఫిలిం చాంబర్
మెట్రో రైళ్లలో బెట్టింగ్ సరోగేట్ యాడ్స్‌పై సోషల్ మీడియా
ధ్వజం.. వాటిని తొలగిస్తామన్న మెట్రో రైల్ వర్గాలు!
హైదరాబాద్ సిటీ/మియాపూర్, పంజగుట్ట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినో యాప్‌ల ప్రచారానికి సంబంధించి.. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి, అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మియాపూర్‌కు చెందిన ఫణీంద్రశర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 318(4), 112 రెడ్ విత్ 49, తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్‌లోని 3, 3(ఏ), 4 సెక్షన్లు, ఐటీ చట్టంలోని 66(డీ) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. సినీ ప్రముఖులు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని.. వారిని అభిమానించే యువత వారి మాటలు నమ్మి ఈ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయారని, ఇంతమంది నష్టపోవడానికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫణీంద్రశర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెట్టింగ్‌యా్‌పల వల్ల అనేకమంది పలు విధాల నష్టపోయారని.. ఆర్థిక ఇబ్బందుల పాలై ఆత్మహత్యాయత్నం కూడా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా బెట్టింగ్ యాప్‌ల గురించి యువత మాట్లాడుకునే సమయంలో విని, ఆకర్షితుడినై బెట్టింగ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించి.. బంధువులు సర్దిచెప్పడంతో ఆగిపోయానని ఫిర్యాదులో వివరించారు.
చట్టవిరుద్ధమైన బెట్టింగ్, జూదం, క్యాసినో యాప్స్‌ను, వెబ్‌సైట్లను ప్రమోట్ చేస్తున్న 25 మంది సినీనటుల పేర్లనూ ఆయన ప్రస్తావించారు. సినీ ప్రముఖులతోపాటు.. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, బుల్లితెర ప్రముఖులు శ్రీముఖి, విష్ణుప్రియ, శోభా శెట్టి, టేస్టీ తేజ, రీతుచౌదరి, వర్షిణి సౌందరరాజన్, సిరి హన్మంతు, వాసంతి కృష్ణన్, అమృతచౌదరి, నయని పావని, నేహ, పండు, ఇమ్రాన్, యూట్యూబర్లు హర్షసాయి, భయ్యా సన్నియాదవ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సుప్రీత పేర్లనూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఈ వ్యవహారంపై విజయ్ దేవరకొండ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన ‘ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్’కు మాత్రమే ప్రచారం చేశారని, వాటికి అనుమతి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆయన ప్రచారకర్తగా పరిమితమయ్యారని స్పష్టం చేసింది. ‘‘ఆయన ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్‌గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రొడక్ట్‌కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్‌కు ప్రచారకర్తగా ఉంటారు. అలాంటి అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలిపింది. ఏ23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత ఏడాది పూర్తయింది. ఇప్పుడు ఆ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. అక్రమంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన ప్రచారకర్తగా వ్యవహరించలేదు’’ అని విజయ్ దేవరకొండ టీమ్ స్పష్టం చేసింది. ఇదే కోవలో రానా టీమ్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నైపుణ్య ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రానా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గడువు 2017లో పూర్తయింది. చట్టబద్ధంగా అనుమతి ఉన్న వాటికే ఆయన ఆమోదం తెలిపారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా న్యాయ బృందం అన్ని భాగస్వామ్యాలనూ క్షుణ్నంగా సమీక్షిస్తుంది’’ అని అందులో పేర్కొంది.
గంటల తరబడి విచారణ..
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగా.. యాంకర్లు విష్ణుప్రియ, రీతూచౌదరిని పంజగుట్ట పోలీసులు గురువారం విచారించారు. ఉదయం 10 గంటలకు విష్ణుప్రియ తన న్యాయవాదితో రాగా.. రీతూ చౌదరి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వచ్చారు. పోలీసులు వారిని వేరువేరుగా, కలిపి విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేసినట్టు తెలిసింది. వారి మొబైల్ ఫోన్లను సైతం జప్తు చేశారు. రాత్రి 9.20 తర్వాత వారు బయటికి వచ్చారు. వారికి 41సీఆర్పీసీ నోటీసు ఇచ్చి మళ్లీ 25న విచారణకు రావాలని చెప్పినట్టు విష్ణుప్రియ న్యాయవాది మీడియాకు తెలిపారు.
కఠిన చర్యలు: టీఎ్‌ఫపీసీ
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో సినీ ప్రముఖల పేర్లు రావడంతో తెలుగు ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. ‘‘సినిమా వారైనా, మరెవరైనా చట్టానికీ, న్యాయానికీ కట్టుబడి ఉండాలి. ఈ యాప్‌ల వల్ల సమాజానికి చెడు జరుగుతుంటే అది తప్పే. రెండు రోజుల్లో ‘మా’కు లేఖ రాస్తాం. ఆ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరతాం. ప్రజల జీవితాలను పణంగా పెట్టే వాటికి దూరంగా ఉందాం’’ అని పేర్కొంది. మరోవైపు.. ప్రముఖ బెట్టింగ్ సంస్థ ‘వన్‌ఎక్స్‌బెట్’కు చెందిన ‘వన్‌ఎక్స్‌బ్యాట్’ అనే వెబ్‌సైట్ పేరుతో మెట్రో రైళ్లలో సరోగేట్ యాడ్స్ ప్రచారం జరుగుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ ప్రచారంపై 2023లోనే విమర్శలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసులు బెట్టింగ్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో.. ఆ యాడ్స్‌ను తొలగిస్తామని మెట్రో రైల్ వర్గాలు తెలిపినట్టు సమాచారం.
తెలియక చేశా.. తప్పు తెలుసుకున్నా: ప్రకాశ్‌రాజ్
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో.. గతంలో తాను చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. దీనిపై ‘ఎక్స్’లో ఒక వీడియో విడుదల చేశారు. ‘‘అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలిగా. చాలా మంది ప్రశ్నించారు. (బెట్టింగ్ యాప్‌లను) ఎలా ప్రమోట్ చేస్తారని! 2016లో ఇలాంటి ఒక యాడ్ నాదగ్గరికి వచ్చింది. నేను ప్రమోట్ చేయడం నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు అని అర్థమైంది. వాళ్లు మళ్లీ నన్ను 2017లో సంప్రదించారు. దానికి నేను.. ‘ఇది తప్పు. అప్పుడు నేను తెలియక చేశాను’ అని చెప్పాను. 2017 నుంచి నేను బెట్టింగ్ యాప్‌లను నేను ప్రమోట్ చేయలేదు. 2021లో ఆ కంపెనీని వేరొకరు తీసుకున్న తర్వాత అప్పట్లో నేను చేసిన ప్రమోషన్‌ను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే.. దానిపై నేను అభ్యంతరం తెలిపాను. వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు.. ‘నా కాంట్రాక్ట్ ముగిసింది. ఇది తప్పు’ అంటూ ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా సందేశం పంపాను. దాంతో వారు ఆపేశారు. ఇప్పుడు అది మళ్లీ లీక్ అయింది. దాని వల్ల ఈ సమాధానం నేను చెబుతున్నా. పోలీసులు నన్ను పిలిచినా వారికి సమాధానం చెబుతాను. 2017 నుంచి ఎప్పుడూ నేను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయలేదు. నేను యువతకు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. యువత బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దు. గేమింగ్ యాప్.. అదొక వ్యసనం. దయచేసి మీ జీవితాన్ని కోల్పోకండి’’ అని ప్రకాశ్ రాజ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.