Sitarama Project: సీతమ్మసాగర్ బ్యారేజీ డిజైన్లకు గ్రీన్‌సిగ్నల్!
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:23 AM
సీతారామ ఎత్తిపోతల పథకం (సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు)లో భాగంగా నిర్మించ తలపెట్టిన బ్యారేజీ డిజైన్లు సరిగ్గానే ఉన్నాయని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అప్రైజల్ డైరెక్టరేట్ తెలిపింది.
రాష్ట్రానికి కేంద్ర జలవనరుల సంఘం లేఖ
తాము లేవనెత్తిన అంశాలను చేర్చుతూ నవీకరించిన డీపీఆర్ సమర్పించాలని సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం (సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు)లో భాగంగా నిర్మించ తలపెట్టిన బ్యారేజీ డిజైన్లు సరిగ్గానే ఉన్నాయని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అప్రైజల్ డైరెక్టరేట్ తెలిపింది. ప్రాజెక్టు బ్యారేజీ స్థిరత్వాన్ని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ప్రమాణాల మేరకు విశ్లేషించగా, సరిగ్గానే ఉన్నట్టు తేలిందని అప్రైజల్ విభాగం డైరెక్టర్ మనోజ్‌కుమార్ మీనా ఈ నెల 4న రాష్ట్రానికి లేఖ రాశారు. దీంతో ప్రాజెక్టుకి సీడబ్ల్యూసీలోని సాంకేతిక సలహా మండలి (టీఏసీ) అనుమతులకు మార్గం సుగమమైనట్లేనని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ల వైఫల్యంతోనే కుంగిందని తేలిన నేపథ్యంలో సీతమ్మసాగర్ బ్యారేజీ డిజైన్లను పునఃపరిశీలించిన తర్వాతే అనుమతుల విషయంలో ముందుకెళ్తామని ఇటీవల జరిగిన టీఏసీ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఆ ప్రాజెక్టు డిజైన్లను సీడబ్ల్యూసీకి తెలంగాణ నీటి పారుదల శాఖ సమర్పించింది. వీటిని పరిశీలించిన సీడబ్ల్యూసీలోని అప్రైజల్ విభాగం డైరెక్టర్ పలు అంశాలపై వివరణ కోరారు. భూకంపాల విషయంలో డిజైన్ల రూపకల్పనలో అనుసరించిన ప్రమాణాలు సమర్పించకపోవడంతో బ్యారేజీ స్థిరత్వాన్ని విశ్లేషించడం సాధ్యం కాలేదన్నారు.
బ్యారేజీ నుంచి దిగువకు దూకే వరద ఉధృతితో బ్యారేజీకి ఎలాంటి నష్టం జరగకుండా డిజైన్ల రూపకల్పనలో తగిన ఏర్పాట్లు చేసినట్టు గుర్తించామని తెలిపారు. అయితే, 2డీ మోడల్ అధ్యయనం నిర్వహించి నీటి ఉధృతిని నిర్ధారించాల్సి ఉందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి హైడ్రో మెకానికల్ పరికరాలకు సంబంధించిన డిజైన్ లెక్కలతో పాటు బ్యారేజీ గేట్లు, స్టాప్ లాగ్ గేట్లు, పవర్ హౌజ్‌కి సంబంధించిన ఇన్‌టేక్ గేట్లు, డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్స్‌కి సంబంధించిన డ్రాయింగ్స్‌ను సమర్పించలేదని వెల్లడించారు. గత నెలలో రాష్ట్ర అధికారులు బ్యారేజీ ప్రధాన గేట్లు, స్లూయిస్ రేడియల్ గేట్లకి సంబంధించిన డ్రాయింగ్స్‌ను సమర్పించగా, అవి కూడా సరైన రీతిలో ఉన్నట్టు నిర్ధారించామని లేఖలో ప్రస్తావించారు. తమకు సమర్పించిన సీతారామ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌లో కీలక నిర్మాణాలైన ఇన్‌టేక్, వాటర్ కండక్టర్ సిస్టమ్‌కు సంబంధించిన డిజైన్ లెక్కలు, పంప్‌హౌజ్ డిజైన్లు, పెన్‌స్టాక్ డిజైన్లు వంటివి లేవని పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగంగా 280 మెగావాట్ల జలవిద్యుత్తు కేంద్రాన్ని నిర్మించనుండగా, వీటికి సంబంధించిన డ్రాయింగ్స్ సైతం సమర్పించలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీపీఆర్‌తో నీటి పంపింగ్/ఎత్తిపోతలతో పాటు విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించలేమని స్పష్టం చేశారు. ఈ అంశాలన్నింటినీ పొందుపరిచి నవీకరించిన డీపీఆర్‌ను మళ్లీ సమర్పించాలని రాష్ట్రానికి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా
ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..
For More AP News and Telugu News