Naxal Attack in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోఎన్‌కౌంటర్ వరంగల్ వాసి సుధాకర్ మృతి
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:19 AM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతేవాడా జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు, వారిలో సారయ్య, పండ్రు, మన్ను మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

ఇతనిపై రూ.25 లక్షల రివార్డ్.. ఇద్దరు అంగరక్షకుల ఎన్‌కౌంటర్
మరో ఇద్దరు మృతిచెందినట్లు అనుమానాలు
చర్ల/చింతూరు/మడికొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): దండకారణ్యంలో మారోమారు తుపాకీ గర్జించింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ అంకేశ్వరపు సారయ్య ఉన్నారు. 55 ఏళ్ల వయసున్న సారయ్య స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట మండలం తరలాపల్లి. సారయ్య అంగరక్షకులు-- పండ్రు ఆత్రా, మన్ను బర్సా కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారనే ప్రచారం జరుగుతున్నా.. పోలీసులు నిర్ధారించలేదు. అయితే.. సారయ్య, పండ్రు, మన్ను మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లు తెలిపారు. రెండు జిల్లాలకు చెందిన సుమారు 500 మంది డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించిన సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని, ఘటనాస్థలి నుంచి ఇన్సాస్, 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు దంతేవాడ ఎస్పీ గౌరవ్‌రాయ్ వెల్లడించారు. సుధాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 100 మంది నక్సల్స్ మృతిచెందినట్లు వివరించారు.
వ్యవసాయ కూలి నుంచి..
సారయ్య పదో తరగతి వరకు చదివి.. కొంతకాలం వ్యవసాయ కూలీగా, బావులు తవ్వే కార్మికుడిగా పనిచేశారు. అంకేశ్వరపు ఎల్లమ్మ, వెంకటయ్య దంపతులకు సారయ్య పెద్ద కుమారుడు. ఆయనకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి ప్రభుత్వ పాఠశాలలో 1982-83లో పదోతరగతి పూర్తిచేసిన సారయ్య ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్‌ఎ్‌సయూ)లో చురుకుగా పాల్గొనేవారు. గ్రా మంలో సారా వ్యతిరేక ఉద్యమం, కూలీల కోసం ‘చేసిన పనికి తగిన కూలీ’ వంటి అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేవారు. భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతి.. ‘దున్నే వాడిదే భూమి’ అని ఉద్యమించారని అతని బాల్య స్నేహితులు గుర్తుచేసుకుంటున్నారు. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పోలీసులు సారయ్యను 1985లో అరెస్టు చేశారు. 1986లో జైలు నుంచి విడుదలయ్యాక.. వ్యవసాయ కూ లీగా.. బావులు తవ్వే కార్మికుడిగా పనిచేవారు. 1991లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన సమాచారం కుటుంబ సభ్యులకు తెలియదు. సారయ్య తన సొంత గ్రామానికి తిరిగి రాలేదు. చనిపోయే వరకు కూడా ఆయన బ్రహ్మచారిగా ఉన్నారని.. మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి.. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారని తెలుస్తోంది. సారయ్య మరణ వార్తతో తరాలపల్లిలో విషా దం నెలకొంది. సారయ్య తండ్రి నాలుగేళ్ల క్రితం, తల్లి మూడేళ్ల క్రితం కన్నుమూశారని గ్రామస్థులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ