CM Revanth Reddy: రాహుల్ మాటే వేదవాక్కు
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:58 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాటే తనకు వేదవాక్కని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయడమే తన కర్తవ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎవరేమనుకున్నా పట్టించుకోను
తను చెప్పిందే చేస్తా.. ఎన్ని కష్టాలొచ్చినా భరిస్తా
రాహుల్‌గాంధీతో నాకు గ్యాప్ అసత్య ప్రచారం
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచీ జరుగుతోంది
కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
42ు రిజర్వేషన్ కోసం పార్లమెంటు చట్టం కోరతాం
దాన్ని నెరవేర్చే బాధ్యత కిషన్‌రెడ్డి, సంజయ్‌దే
పార్టీ పరంగా 42ు అంటే కాదు చట్టం అన్నారు
ఇక కుల గణన ఆధారంగానే సంక్షేమ పథకాలు
ప్రధాని పదవిని కించపరచలేదు
చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేర్చాలి
మార్చి 31 లోపు వంద శాతం రైతు భరోసా
సబిత, తలసాని ఏ పార్టీలో గెలిచి మంత్రులయ్యారు?
కేంద్రం చట్టం చేస్తేసభాపతికి గడువు పెట్టొచ్చు
యమునా ప్రక్షాళనలా మూసీ ఎందుకు వద్దు?
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్‌చాట్
రాహుల్‌తో 50 నిమిషాల పాటు రేవంత్ భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాటే తనకు వేదవాక్కని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయడమే తన కర్తవ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ ఏం చెప్పారో అది మాత్రమే చేస్తానని, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని తేల్చిచెప్పారు. రాహుల్‌తో తనకు దూరం పెరిగిందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. తన వ్యతిరేకుల పైశాచిక ఆనందం ఎప్పటికీ నెరవేరదని చెప్పారు. శనివారం ఢిల్లీలోని జన్‌పథ్‌లో రాహుల్‌గాంధీతో 50 నిమిషాల పాటు ముఖాముఖి సమావేశమైన రేవంత్‌రెడ్డి తెలంగాణలో కుల గణన, ఎస్సీ వర్గీకరణ కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. అనంతరం రేవంత్‌రెడ్డి తన అధికారిక నివాసంలో మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఢిల్లీలో తనకు ప్రాధాన్యం తగ్గిందని, రాహుల్‌గాంధీతో ఎడం పెరిగిందని ప్రతిపక్షం చేస్తున్న ప్రచారం కొత్తదేమీ కాదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకం జరగక ముందు నుంచి తనపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి అవుతడా? అంటూ ఇలాంటి చర్చలే పెట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే టికెట్లు, రాజ్యసభ టికెట్ల విషయంలోనూ ఏవేవో కథలు ప్రచారం చేశారని చెప్పారు. అవన్నీ తాను పట్టించుకోనన్నారు. పీసీసీ అధ్యక్షుడయ్యాక ఎన్నో ఒడుదొడుకులు ఎదురయ్యాయని, అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నానని చెప్పారు. పార్టీ అప్పగించిన బాధ్యతల ప్రకారం ప్రజల్లోకి వెళ్లానని, ప్రజలు ఆశీర్వదించడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిందని తెలిపారు. ఇక ప్రజలకు ఏం చేయాలన్నదే తనకు తొలి ప్రాధాన్య అంశమని చెప్పారు. రేపు ఏం చేశావని ప్రజలు అడిగేది తననేనని అన్నారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నపుడు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడం సహజమని రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యతిరేకతను అధిగమించి రాజభరణాల రద్దు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన కూడా అలాంటివేనన్నారు. తనది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్‌గాంధీ ఏం చెబితే అది చేస్తానన్నారు. వర్గీకరణ, కులగణన దేశానికి రోడ్ మ్యాప్ లాంటివని చెప్పారు. కుల గణన ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు,.
ప్రధాని హోదాకు భంగం కలిగేలా మాట్లాడలేదు
ప్రధానినరేంద్ర మోదీని కించపరిచేలా తానేమీ మాట్లాడలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానన్నారు. తేదీల్లో ముందు వెనుక తేడాలు ఉండొచ్చేమో కానీ ప్రధాని గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. మోదీకి బీసీల పట్ల నిజంగానే ప్రేమ ఉంటే జనగణనలో కుల గణనను జత చేయాలని సవాలు విసిరారు. మోదీ విషయంలో తన వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే స్వయంగా 1994లోమోదీ బీసీగా మారారని అంగీకరించారన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటే, కుదరదు చట్టం చేయాల్సిందేనని బీజేపీ నేతలు పట్టుబట్టారని, అందుకే, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మార్చిలోనే పార్లమెంటులో చట్టం చేయించే బాధ్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌దేనన్నారు. కేసీఆర్‌లా తామేమీ కళాశాల పిల్లలతో మొక్కుబడి సర్వే చేయించలేదని, ప్రభుత్వ ఉద్యోగులతో సమగ్ర సర్వే చేశామని చెప్పారు. ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలు రెండుసార్లు నమోదయ్యే అవకాశమే లేదన్నారు. జనగణనలో కులగణన చేసి తమ లెక్కలు తప్పని నిరూపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. 1931తర్వాత దేశంలో కుల గణన జరగలేదని, అలాంటప్పుడు ఏ కులానికి చెందిన జనాభా ఎంతో ఎలా చెబుతారని ప్రశ్నించారు.
కేసీఆర్ సర్వే తప్పుల తడక
కేసీఆర్ సర్వేలో బీసీలు 51శాతం, ఓసీ 21 శాతం, ఎస్సీలు 18శాతం, ఎస్టీలు 10శాతం ఉన్నట్లు తేల్చారని రేవంత్ ప్రస్తావించారు. అందులో మైనారిటీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాము బీసీలను ఐదు కేటగిరీలుగా లెక్కించి, ముస్లిములతో కలిపి 56.33 శాతం బీసీలుగా తేల్చామన్నారు. కేసీఆర్ లెక్క కంటే తమ లెక్కలో ఐదున్నర శాతం మంది బీసీలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ముస్లింలను బీసీల్లో తాము కొత్తగా చేర్చలేదని, ఎప్పటి నుంచో బీసీ-ఈగా ముస్లింలు ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ సర్వేలో ఎస్సీ ఉపకులాలు 82 అని చెప్పారని, క్షేత్ర స్థాయిలో ఉన్నది 59 మాత్రమేనని ప్రస్తావించారు. అవగాహన లేని వాళ్లతో చేయించిన కేసీఆర్ సర్వేలో మూచీ కులం అని అచ్చుతప్పు టైప్ చేసి, చివరికి దాన్నికూడా ఒక కులంగా మార్చారని అన్నారు. తెలంగాణలో ముస్లింలు 17 శాతం ఉన్నారని చెప్పుకొనే వాళ్లని, తాము సర్వే చేసి అది 12.56 శాతమేనని తేల్చామని గుర్తు చేశారు. కేసీఆర్ సర్వే చేసి పదేళ్లు వివరాలన్నీ దాచి పెట్టారని, దానికో చట్టబద్ధత కూడా కల్పించలేదని విమర్శించారు. తొలి దశలో ఏ కులం ఎంతమందో తేల్చామని, రెండో దశలో కులాల వారీగా ఉద్యోగాలు, పదవుల లెక్కలు కూడా తేలుస్తామని అన్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మార్చి మొదటి వారంలో కులగణన నివేదిక వస్తుందని, తర్వాత రిజర్వేషన్లు ఎలా వర్తింపజేయాలో స్పష్టత వస్తుందని తెలిపారు.
మార్చి 31 లోపు 100% రైతు భరోసా
మార్చి 31లోపు వంద శాతం రైతు భరోసా ఇస్తామని రేవంత్ ప్రకటించారు. కేసీఆర్ రూ.10 వేలే ఇస్తే తాము రూ.12వేలు ఇస్తున్నామని చెప్పారు. రియల్ ఎస్టేట్ భూములకు రైతుబంధు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సబిత, తలసాని ఏ పార్టీ తరఫున గెలిచి ఏ పార్టీ మంత్రివర్గంలో పని చేశారని ప్రశ్నించారు. ప్రజలకు అన్నీ గుర్తుంటాయన్నారు. చట్టసభ సభ్యుల ఫిరాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి సభాపతికి నిర్దేశిత గడువు పెట్టాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, అది కేంద్రం చేతిలో ఉందని చెప్పారు.
మంత్రివర్గ విస్తరణపై అన్నీ ఊహాగానాలే
మంత్రివర్గ విస్తరణపై అన్నీ ఊహాగానాలేనని, అదే నిజమైతే రాహుల్‌తో తానొక్కడినే ఎందుకు మాట్లాడతానని ప్రశ్నించారు. తనతోపాటు పీసీసీ అధ్యక్షుడు, ఇతరులు ఉంటారన్నారు. కులగణనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిపై రాహుల్‌కు సమగ్రంగా వివరించానని తెలిపారు. యమునా నదిని ప్రక్షాళన చేస్తామని చెబుతున్న బీజేపీ మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు సహకరించందని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Music Night: యుఫోరియా మ్యూజికల్ నైట్.. ఉర్రూతలూగిస్తున్న తమన్..
Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..