Tribal Welfare: ఆదివాసీలకు సీఎం కోటాలో ఇళ్లు
ABN , Publish Date - Jan 11 , 2025 | 02:40 AM
రాష్ట్రంలోని ఆదివాసీలకు ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇళ్లతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కోటా కింద ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే కోటాతోపాటు అదనం
విద్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి అండ
ఉద్యమ కేసులను ఎత్తివేస్తాం
గోండు భాషలో ప్రాథమిక విద్య
సమస్యలు చెప్పండి.. ఆందోళనలు చేయొద్దు.. సంఘాలతో సీఎం
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆదివాసీలకు ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇళ్లతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కోటా కింద ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నాన్ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు కూడా ఇళ్లు కేటాయిస్తామన్నారు. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని అధికారులకు సూచించారు. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లను ఉచితంగా అందిస్తామన్నారు. ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేయడంపై దృష్టి పెట్టాలని, దీనిని స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాజకీయాల పరంగా కూడా ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూస్తున్నామని తెలిపారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఆదివాసీలపై ఉద్యమాల సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని, ఈ విషయంలో అవసరమైతే శాసనసభలో చర్చ పెట్టి తీర్మానం చేస్తామని ప్రకటించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొట్టమొదటి సభను ఇంద్రవెల్లిలో నిర్వహించామని రేవంత్ గుర్తు చేశారు. ఆ సమయంలో చర్చించుకున్న అంశాలన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేశామని తెలిపారు.
ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక స్టడీ సర్కిల్..
ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్థికి ప్రత్యేక శ్రద్థ తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీని భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఓవర్సీస్ స్కాలర్‌షి్‌పకు దరఖాస్తు చేసుకున్న ఆదివాసీ విద్యార్థులందరికీ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, ఏజెన్సీలోని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని అన్నారు. విద్యార్థులకు ప్రాథమిక విద్యను గోండు భాషలో అందించే అంశంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉట్నూరు, భద్రాచలంలోని ట్రైబల్ బీఈడీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ రైతుల కోసం రాయ్ సెంటర్ల నిర్మాణానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలు, ఎన్ని భవనాలు అవసరమనే దానిపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.