Share News

CM Revanth Reddy: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:47 AM

రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అందువల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు

  • సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

  • కాంగ్రెస్‌ కార్యకర్తలకు సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు

హైదరాబాద్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. అందువల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి అధ్యక్షతన గాంధీభవన్‌లో బుధవారం జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) భేటీలో సీఎం పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ జనవరి 26 నుంచి రైతు భరోసా అందించబోతున్నామని, వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ. 12 వేల చొప్పున ఇవ్వనున్నామని చెప్పారు. కొత్త రేషన్‌ కార్డులూ ఇవ్వనున్నామన్నారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతులకు రూ.21 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేశామని తెలిపారు.


రైతు సంక్షేమానికి రూ.54వేల కోట్ల మేర ఖర్చు చేశామన్నారు. గృహలక్ష్మి, మహాలక్ష్మి తదితర పఽధకాలను ప్రస్తావించారు. ఆయా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇక, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు తెలియజేశామని తెలిపారు. కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీఏసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


మన్మోహన్‌సింగ్‌కు పీఏసీ నివాళి

సమావేశం ప్రారంభానికి ముందు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సీఎం రేవంత్‌ తదితరులు నివాళి అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మన్మోహన్‌కు సంతాపం తెలిపామని, భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేశామని గుర్తు చేశారు.

Updated Date - Jan 09 , 2025 | 04:47 AM