CM Revanth Reddy: పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Jan 11 , 2025 | 02:30 AM
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తమకు ఒక కల ఉందని, అదే ‘తెలంగాణ రైజింగ్’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు
గొప్ప నగర నిర్మాణమే మా లక్ష్యం
తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో ఫోర్త్ సిటీ
చైనా తరహాలో క్లస్టర్లు సృష్టిస్తాం
సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తమకు ఒక కల ఉందని, అదే ‘తెలంగాణ రైజింగ్’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. న్యూయార్క్, లండన్, సియోల్, టోక్యో, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలనే ఆంకాక్షలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో నిర్వహించిన భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, స్వేచ్ఛా వాణిజ్యం, మార్కెట్లు పని చేయడానికి పారిశ్రామిక రంగం సహకరించాలని కోరారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ సులభతర వాణిజ్య విధానాలను అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో సేవల రంగం కేంద్రీకృతంగా ఫోర్త్ సిటీ నిర్మాణం చేపట్టాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో సంపూర్ణ నెట్ జీరో లక్ష్యాలతో పని చేస్తున్నామని, నగరాన్ని కాలుష్య రహితంగా మార్చడంలో భాగంగా 3200 ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్తు బస్సులను సమకూర్చబోతున్నామని వివరించారు. వరదలు లేని నగరంగా దేశంలోనే పర్యావరణ హితంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా 55 కిలోమీటర్ల పొడవైన మూసీ పునరుజ్జీవ పనులను ప్రారంభించామన్నారు. 2050 నాటికి తాగునీటి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్యలో ఫార్మా లైఫ్‌సైన్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, సోలార్ పవర్ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు.
చైనా తరహా క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు
చైనా తరహాలో రకరకాల క్లస్టర్లను సృష్టించాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒక లైట్ సిటీ, మార్బుల్ సిటీ, గ్రానైట్ సిటీ, ఫర్నిచర్ సిటీ.. ఇలా ప్రత్యేక తరహాలో రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ మార్కెటింగ్ కార్యకలాపాలను విస్తరిస్తామన్నారు. ఇది పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో 70 శాతం పట్టణీకరణ జరుగుతుందన్నారు. గ్రామీణ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, సేంద్రియ సాగు, రైతుల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు నైపుణ్యావకాశాలపై దృష్టి పెట్టామన్నారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో హైదరాబాద్‌ను ప్రపంచంలో ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం శుభపరిణామమని, అందరం కలిసి అద్భుతాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐఐ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ పురి తదితరులు పాల్గొన్నారు.