CM Revanth Reddy: విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:20 AM
మన విద్యా విధానం ప్రమాదకరంగా ఉందని, విద్యలో ప్రమాణాలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వం మాత్రమే కాకుండా.. తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలన్నారు.

ప్రస్తుత విద్యా విధానం ప్రమాదకరం.. ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం
టీచర్లతో కొట్లాడే శక్తి నాకు లేదు: రేవంత్
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మన విద్యా విధానం ప్రమాదకరంగా ఉందని, విద్యలో ప్రమాణాలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు ప్రభుత్వం మాత్రమే కాకుండా.. తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంచే విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండలిలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి మాట్లాడారు. 2021లో నేషనల్ అచీవ్ మెంట్ సర్వే జరిగిందని, అందులో మూడో తరగతి, ఐదో తరగతి చదివేవారిలో 75 శాతం మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యం కూడా చూపలేదని తేలిందన్నారు. సబ్జెక్టులవారీగా దేశంలో తెలంగాణ 37వ ర్యాంకులో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య 6.50 లక్షలు తగ్గిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 10 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామని, 36 వేల మంది టీచర్లను బదిలీ చేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,100 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు పెడుతున్నామంని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్లో ఒక్కో విద్యార్థికి 98 వేలు ఖర్చు చేస్తోందని అన్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ కోణంలో ఆలోచించినంత కాలం విద్యారంగాన్ని ప్రక్షాళన చేయలేమన్నారు.
నైపుణ్య కొరతను అధిగమించేందుకే..
సమాజంలో అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడుతోందని సీఎం రేవంత్ అన్నారు. దీనిని అధిగమించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. విద్యావ్యవస్థపై సూచనలు ఇవ్వాలని మండలి సభ్యులను సీఎం కోరారు. అందరి సూచనలు, సలహాలతో ప్రక్షాళన చేస్తామని, పాలసీ ముసాయిదా రూపొందించి ప్రజల్లో చర్చకు పెడదామని అన్నారు. ఈ రోజు నిర్ణయం తీసుకోకపోతే ఇక ఎప్పుడూ ప్రక్షాళన చేయలేమన్నారు. భవిష్యత్తులోనూ విద్యాశాఖను తన వద్దే పెట్టుకుని పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి తనకు లేదని, వారు కూడా విద్యావ్యవస్థ బలోపేతానికి సహకరించాలని కోరారు. త్వరలోనే కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు విషయంలో ఎమ్మెల్సీ కవిత పొరపాటు పడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. ఈ పథకానికి గతంలో ఏ పేరూ లేనందునే జైపాల్‌రెడ్డి పేరు పెట్టామన్నారు. అంబేడ్కర్ పేరును మార్చి.. జైపాల్‌రెడ్డి పేరును ఏ పథకానికీ పెట్టలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News