Stadium: లక్ష మందికూర్చునే స్టేడియం
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:18 AM
‘‘దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా.. ఒలింపిక్స్ పతకాల్లో వెనకబడ్డాం’’.. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. ఈ నేపథ్యంలో క్రీడారంగానికి ఊతమిస్తూ.. తెలంగాణను క్రీడలకు కేరా్‌ఫగా మార్చాలని ఆయన నిర్ణయించారు.
వంద ఎకరాల్లో వివిధ ఆటలకు మైదానాలు.. క్రీడాభివృద్ధికి విధాన రూపకల్పన
క్రీడాకారులకు సౌకర్యాలు.. ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
15, 16 తేదీల్లో సీఎం ఆస్ట్రేలియా పర్యటన.. 18న సింగపూర్.. 20-24 తేదీల్లో దావోస్
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నా.. ఒలింపిక్స్ పతకాల్లో వెనకబడ్డాం’’.. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. ఈ నేపథ్యంలో క్రీడారంగానికి ఊతమిస్తూ.. తెలంగాణను క్రీడలకు కేరా్‌ఫగా మార్చాలని ఆయన నిర్ణయించారు. ఈ క్రమంలో ఫ్యూచర్‌సిటీ లేదా మరోచోట వంద ఎకరాల్లో వివిధ క్రీడలకు అనుకూలమైన మైదానాలను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఏకకాలంలో లక్షమంది కూర్చొనేలా భారీ స్టేడియాన్ని నిర్మించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఆ స్టేడియంలో ఆధునిక సాంకేతికత ఉండేలా చర్యలు తీసుకుంటారు. అంతేకాదు.. క్రీడాభివృద్ధికి ప్రత్యేక పాలసీ, క్రీడాకారులకు సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ హబ్ కోసం ఫ్యూచర్‌సిటీలో 760 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే..! ప్రస్తుతం గుజరాత్‌లో ఏకకాలంలో 1.32 లక్షల మంది కూర్చునే వీలున్న భారీ స్టేడియం ఉంది. అదే స్థాయిలో.. లక్ష మంది ప్రేక్షకుల సామర్థ్యంతో తెలంగాణలో వంద ఎకరాల్లో అతిపెద్ద స్టేడియాన్ని నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.
అత్యాధునిక సాంకేతికతను ఈ స్టేడియంలో అందుబాటులో తీసుకురావాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇలాంటి స్టేడియం అందుబాటులోకి వస్తే.. క్రికెట్ లాంటి క్రీడలకు తెలంగాణ కేరా్‌ఫగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. క్రీడామైదానాల ఏర్పాటుతోపాటు.. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, మౌలిక వసతుల కల్పనకు సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ నెల 15, 16 తేదీల్లో ఆస్ట్రేలియా, 18న సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ క్రీడల కోసం తీసుకుంటున్న చర్యలు, క్రీడాకారులకు కల్పిస్తున్న సదుపాయాలు, శిక్షణ తీరును పరిశీలించనున్నారు. ఆయన వెంట శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, సీఎం సలహాదారు జితేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉంటారు. వీరంతా క్వీన్స్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ, పలు మైదానాలను పరిశీలించనున్నారు.
యూనివర్శిటీలో అందిస్తున్న కోర్సులు, శిక్షణలతోపాటు, గ్రౌండ్ల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేయనున్నారు. సింగపూర్‌లో పలు అంశాలపై అధ్యయనం కొనసాగనుంది. ముఖ్యంగా.. చిన్న దేశమైనా.. ఎక్కువ మైదానాలుండడం.. ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో మెడల్స్‌ను సాధించడం వంటి వాటిపై దృష్టిసారిస్తారు. అక్కడ క్రీడా మైదానాల కిందే పార్కింగ్ సదుపాయాలుంటాయి. దీనిపై సీఎం ప్రత్యేకంగా ఆరాతీస్తారని సమాచారం. హైదరాబాద్‌లో ఐపీఎల్ జరిగితే.. ట్రాఫిక్ ఇబ్బందులు తెలిసిందే..! సింగపూర్‌లో అలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలనూ పరిశీలిస్తారు. సింగపూర్‌లో పలు మాల్స్‌పైనా క్రీడా కేంద్రాలున్నాయి. వాటి నిర్మాణ తీరుతోపాటు.. ఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్ రావడానికి క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీయనున్నారు. 20-24 తేదీల్లో సీఎం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో పాల్గొంటారు.