Group-1 Posts: మార్చిలోగా గ్రూప్-1 నియామకాలు
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:06 AM
గ్రూప్-1 పోస్టుల నియామకాలను మార్చి 31లోగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్-1 నిర్వహించలేదని, తాము అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించినట్లు గుర్తుచేశారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు
రాష్ట్రం నుంచి సివిల్స్‌కు అధికంగా ఎంపిక కావాలి
సీఎం రేవంత్‌రెడ్డి సివిల్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ
ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఢిల్లీలో బస: భట్టి
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పోస్టుల నియామకాలను మార్చి 31లోగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్-1 నిర్వహించలేదని, తాము అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం కింద ఆదివారం ఆయన ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన అఽభ్యర్థులకు ఆర్థిక సాయంగా రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతగానో నష్టపోయారన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే.. దేశంలో ఎక్కడా లేని విధంగా 55,143ఉద్యోగ నియామకాలు చేపట్టాం.
సివిల్స్‌కి రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతో అభయహస్తాన్ని ప్రారంభించాం. అభ్యర్థులకు ఆర్థికంగా అండగా ఉండేలా.. రూ.లక్ష సాయం అందిస్తున్నాం. రాష్ట్రం నుంచి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లే ప్రతి అభ్యర్థి సివిల్స్‌కు ఎంపికవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. దేశంలో అత్యధికంగా సివిల్స్ ఎంపిక మన రాష్ట్రం నుంచి జరుగుతుందని గర్వంగా చెప్పుకొనేస్థాయికి తెలంగాణను తీసుకెళ్లాలి’’ అని అభిలషించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తామన్నారు. ‘‘ఏ రాష్ట్రంలో లేని విధంగా సివిల్స్ వైపు యువత మొగ్గుచూపేలా సింగరేణి సంస్థ తరఫున ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతి దశలోనూ సివిల్స్ అభ్యర్థులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. కాగా, టీఎ్‌సజెన్‌కోలో అసిస్టెంట్ ఇంజనీర్స్, కెమిస్ట్స్ పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.