CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
ABN , Publish Date - Feb 27 , 2025 | 03:50 AM
తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల మరణించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాడిన రాజలింగమూర్తి,

రాజలింగమూర్తి, సంజీవరెడ్డి, కేదార్‌ల మరణం అనుమానాస్పదం
ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం.. నిజాలు వెలికితీస్తాం
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి గత కేసీఆర్ సర్కారుదే బాధ్యత
పదేళ్ల నిర్లక్ష్యం వల్లే టన్నెల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది
ఫిరాయింపులపై పదేళ్లు రాజ్యాంగంలో మార్పులేమీ రాలేదు
తెలంగాణలో ఉప ఎన్నికలు.. కేటీఆర్ అవగాహన రాహిత్యమే
విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే
సీబీఐ విచారణ కోరితే బీఆర్‌ఎ్‌సను బీజేపీ కలిపేసుకుంటుంది
నా దృష్టి పనిపైనే.. లబ్ధిదారులే కాంగ్రె్‌సను గెలిపిస్తారు
బీఆర్‌ఎస్ కథ ముగిసింది.. భవిష్యత్తులో బీజేపీతోనే మా పోటీ
ఆదాయాన్ని నెలకు 22 వేల కోట్లకు పెంచితేనే సరిపోతుంది
ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల మరణించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాడిన రాజలింగమూర్తి, ఆయన తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించిన న్యాయవాది సంజీవరెడ్డితోపాటు డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్‌ల మరణాలు మిస్టరీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేదార్ ఏడాది క్రితం హైదరాబాద్‌లో ఒక డ్రగ్స్ పార్టీలో దొరికాడని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ కేసు దర్యాప్తును వేగవంతం చేయగానే దుబాయ్‌లో కేదార్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు కేదార్ పార్ట్‌నర్ అని సీఎం ఆరోపించారు. ప్రతి విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేయాలని కోరే కేటీఆర్.. కేదార్ మృతిపై విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌గా మాట్లాడారు. రాజలింగమూర్తి హత్య జరిగిన వెంటనే కాళేశ్వరంపై ఆయన దాఖలు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ న్యాయస్థానాన్ని కోరారని, దీనిని బట్టే అసలేం జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మిస్టరీ మరణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. తద్వారా నిజాలు బయటికి వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఇక ఎల్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదానికి గత కేసీఆర్ ప్రభుత్వమే కారణమని సీఎం రేవంత్ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇది కేవలం రూ.5 వేల కోట్లతో (ప్రస్తుతం పెరిగిన అంచనా వ్యయంతో కలిపి) సుమారు 3.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే గొప్ప ప్రాజెక్టు అని, ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి సొరంగంతో కూడిన ప్రాజెక్టు అని చెప్పారు. ఇందులో కమీషన్లు రావనే ఉద్దేశంతోనే గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దీనిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పదేళ్లపాటు ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో టన్నెల్ మట్టి కుంగి కూలిందని తెలిపారు. క్రమం తప్పకుండా పనులు కొనసాగి ఉంటే.. ప్రమాదం జరిగి ఉండేది కాదేమోనని అభిప్రాయపడ్డారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు..
గత కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిందని సీఎం ఆరోపించారు. అతితక్కువ వ్యయంతో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టును కాదని, కేవలం లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తుందని రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. చివరికి 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేదన్నారు. కాళేశ్వరం లేకపోయినా ఈసారి 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఎప్పుడూ ఇంత దిగుమతి రాలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం అనుకోకుండా జరిగిందని, కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడమనేది మానవ తప్పిదంతో జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి, ప్రణాళికా లోపం, కమీషన్ల కోసం కక్కుర్తి పడడం, తానే మేధావిననే భ్రమతో జరిగిన ప్రమాదమని ధ్వజమెత్తారు. కేసీఆర్‌లా తాము తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని, నిపుణుల కమిటీ నివేదికల తర్వాతే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. టన్నెల్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని, దేశంలోనే మొదటిసారిగా 18 సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేసి తీరతామన్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో తనకంటే అనుభవజ్ఞులైన వారు ఉన్నారని, వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని సీఎం అన్నారు. మంత్రివర్గ విస్తరణపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని, విస్తరణ ఉంటుందని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ విలీనానికి బీజేపీ కుట్ర..
తెలంగాణలో గత పదేళ్లలో జరిగిన అవినీతికి సంబంధించి విచారణను సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అంటున్నారని, అయితే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆ పేరుతో బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసుకోవాలన్నది వారి ఆలోచన అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం తదితర అన్ని అంశాల్లో చట్టపరంగా దర్యాప్తు జరుగుతోందని, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి పర్యవేక్షిస్తోందని అన్నారు. హైకోర్టు కంటే సీబీఐ పెద్దదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావును అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ ఘోష్ కమిషన్ దర్యాప్తు చేస్తోందని, కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్‌రావు విదేశాల్లో ఉన్నాడని, ఆయనను తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు. అలాగే, ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఈడీ దర్యాప్తు జరుపుతోందని, మరి కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తుపై కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర క్యాబినెట్‌లో చర్చకు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని, కేసీఆర్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
రాజ్యాంగంలో మార్పులేమీ రాలేదు..
దేశంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 2014 నుంచి 2024 వరకు ఏ రాజ్యాంగం అమల్లో ఉందో, ఇప్పుడు కూడా అదే రాజ్యాంగం అమల్లో ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్ ఏ పార్టీలో గెలిచి, ఏ మంత్రివర్గంలో పనిచేశారో అందరికీ గుర్తుందన్నారు. అయినా, పార్టీ ఫిరాయింపులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మొట్టమొదటిసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది తానేనని గుర్తు చేశారు. 90 రోజుల్లో స్పీకర్ నిర్ణయం చెప్పాలని సుప్రీంకోర్టు తొలిసారిగా ఆదేశించిందని తెలిపారు. ఆ తీర్పు ఆధారంగానే ఆ తర్వాత అనేక మంది ఫిరాయింపులపై పిటిషన్లు దాఖలు చేశారన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ 90 రోజుల్లో స్పీకర్ నిర్ణయాన్ని చెప్పలేదన్నారు. ఒక పార్టీలో 1/3 వంతు మరో పార్టీలో కలిస్తే అది విలీనమైనట్లు అని, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అన్ని రకాలుగా చట్టబద్ధంగా కాంగ్రెస్‌లో విలీనమైందని చెప్పారు. అంతే తప్ప.. ఎమ్మెల్యేల్లో 1/3 మరో పార్టీలో చేరితే అది విలీనం కిందికి రాదన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్, బీజేపీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహరించిన తీరు దేశమంతా చూసిందన్నారు. త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయనడం కేటీఆర్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ కథ ముగిసిందని, భవిష్యత్తులో బీజేపీతోనే తమకు పోటీ ఉంటుందని చెప్పారు.
నా దృష్టి పని పైనే.. ప్రచారంపై కాదు..
సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ వెనక పడుతోందన్న ప్రశ్నకు రేవంత్ బదులిస్తూ.. తన దృష్టంతా పనిపైనే ఉంటుందని, ప్రచారంపై కాదని అన్నారు. మూడేళ్లు ప్రజా సంక్షేమం, అభివృద్ధికే సమయం కేటాయిస్తానని తెలిపారు. పదేళ్లలో కేసీఆర్ చేయలేని ఎన్నో పనులను తాము ఏడాదిలోనే చేసి చూపించామన్నారు. లబ్ధిదారులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ఐఏఎస్, ఐపీఎ్‌సలతోనే పని చేయించుకోవాలి తప్ప కొత్తవారిని ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు తగినవాళ్లు రాష్ట్రంలో నలుగురే ఉన్నారని, ఉన్న అధికారులతోనే సమర్థంగా పని చేయిస్తున్నామని అన్నారు సమష్టి కృషితో రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా నిలుపుతున్నామని చెప్పారు. ఏడాదిలోనే రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 8.5ు నుంచి 6.6 శాతానికి తగ్గిందన్నారు. ఆక్యుపెన్సీలో హైదరాబాద్ బెంగళూరును దాటేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.
కొడంగల్ ఇన్‌చార్జి మా సోదరుడే..
కాంగ్రెస్ కొడంగల్ ఇన్‌చార్జి తన సోదరుడేనని సీఎం రేవంత్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ రాజకీయ వ్యవహారాలు ఆయనే చూసుకుంటున్నారని తెలిపారు. సెక్రటేరియట్‌లో కూర్చుని అధికారులతో రివ్యూలు చేస్తే తప్పు కానీ, నియోజకవర్గంలో ప్రజల తరఫున నిలబడితే తప్పేముందని ప్రశ్నించారు. కేటీఆర్ కొడుకు భద్రాచలం వెళ్లి సీతారాములకు తలంబ్రాలు సమర్పించారని, కేటీఆర్ కొడుకు ఏ హోదాలో అక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. తన సోదరుడు అలాంటి పనులేమీ చెయ్యడం లేదన్నారు. వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు పెడతామని, దీనికోసం అన్నీ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గతంలో హుజూరాబాద్‌లో 1.5 శాతం ఓట్లే వస్తే తనదే బాధ్యత అని చెప్పానని, ఆ తర్వాత అదే హుజూరాబాద్‌లో 40 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఐదేళ్ల తర్వాత దేనికైనా బాధ్యత తనదేనన్నారు. కులగణన విషయంలోనూ అన్నింటికీ తానే బాధ్యత వహిస్తానని, కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పిన దారిలోనే తాను ముందుకు వెళుతున్నానని స్పష్టం చేశారు.
నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష సరికాదు...
దేశంలోని రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రం వివక్ష చూపడం సరికాదని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే కేంద్ర మాత్రం కేవలం 42 పైసలే తిరిగి ఇస్తుందన్నారు. అలాకాకుండా, 50శాతం నిధులు జనాభా ప్రాతిపదికన, మరో 50 శాతం నిధులు కేంద్రానికి రాష్ట్రం చెల్లిస్తున్న పన్నుల ప్రాతిపదికన కేటాయించాలని కోరారు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశామన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించే ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే ప్రతి కార్డుదారుకు సన్నబియ్యం అందిస్తామని అన్నారు.
ప్రతి నెలా 6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం..
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతినెలా రూ.6,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రతినెలా రాష్ట్రానికి సుమారు రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుందని, అందులో వడ్డీలు, వేతనాలకే రూ.13 వేల కోట్ల దాకా చెల్లిస్తున్నామని అన్నారు. మిగిలిన సొమ్ముతోనే సంక్షేమం, అభివృద్ధి అన్నీ చేయాల్సి వస్తోందన్నారు. ఆదాయాన్ని రూ.22 వేల కోట్లకు పెంచితే అన్నింటికీ సజావుగా సరిపెట్టే వీలుంటుందని, అందుకే.. పెంచే పనిలో పడ్డామని చెప్పారు. పన్నుల శాఖలో సంస్కరణలు చేశామని, దీనివల్ల జీఎస్టీ రాబడిలో సుమారు 8 శాతం వృద్ధిని నమోదు చేశామని వెల్లడించారు. మైనింగ్ రంగాన్ని కూడా గాడిలో పెట్టామని, ఇసుక తరలింపులో అక్రమాలకు తావులేకుండా చేశామని తెలిపారు. కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, దశలవారీగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు. ఇక హైదరాబాద్‌లో ఆక్రమణలను పూర్తిగా అరికట్టామని, హైడ్రా తర్వాత ఆక్రమణలు జరగలేదని చెప్పారు. చెరువుల ఆక్రమణ అంటేనే వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితిని తీసుకొచ్చామని తెలిపారు. బీజేపీ నేతలు హైడ్రా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా నిర్వాసితులకు పునారావాసం కల్పించేందుకు చంద్రబాబునాయుడి హయాంలో నందనవనం లాగే ఏదైనా చేస్తే బాగుటుందనే ఆలోచన ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తనను కలవడానికి వచ్చిన తనకు తెలియదన్నారు. కేసీఆర్ లాగా నిర్బంధ పాలన లేదన్నారు.
Read Also : టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..
ఇదెక్కడి వింత రైలు.. రోడ్డు మీద నడస్తున్న ఈ విచిత్రాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..
తమిళనాడు సీఎంకు అమిత్ షా కౌంటర్.. 5 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడి