Share News

CM Revanth Reddy: కక్ష సాధించే వాడినైతే.. కుటుంబమంతా జైల్లోనే!

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:21 AM

తనది కక్ష సాధించే మనస్తత్వమే అయితే మొత్తం కేసీఆర్‌ కుటుంబం ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష, పగ, ప్రతీకారాలకు పోతున్నారని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ చేసిన ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు.

CM Revanth Reddy: కక్ష సాధించే వాడినైతే..  కుటుంబమంతా జైల్లోనే!

ఇవాళ అసెంబ్లీలో కూర్చుని మాట్లాడేవారు కాదు

  • ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు

  • జైల్లో రాత్రి నిద్ర పోకుండా లైట్లు వేసి వేధించారు

  • పదేళ్లలో బీఆర్‌ఎస్‌ రుణమాఫీ రూ.16,908 కోట్లే

  • పది నెలల్లో రూ.20,616 కోట్లు మాఫీ చేశాం

  • పదేళ్ల పాలనను మా పది నెలలతో పోల్చండి

  • అభినందించాల్సింది పోయి కడుపులో కత్తులా?

  • కేటీఆర్‌ గుంటూరు తెలివితేటలు ఇక్కడొద్దు

  • పల్లెటూళ్లో చదివి సీఎం అయ్యానని నాపై అక్కసు

  • ప్రాజెక్టులు కట్టింది మీ ఫామ్‌ హౌస్‌ల కోసమే

  • ఎక్కడెవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా?

  • కేటీఆర్‌, హరీశ్‌ రావులకు పార్టీ కుర్చీపై ఆశ

  • నేపాల్‌ తరహాలో కేసీఆర్‌ను తప్పించే కుట్ర

  • బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): తనది కక్ష సాధించే మనస్తత్వమే అయితే మొత్తం కేసీఆర్‌ కుటుంబం ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉండేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష, పగ, ప్రతీకారాలకు పోతున్నారని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ చేసిన ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. తాము నిజంగా కక్ష సాధింపునకు పాల్పడితే బీఆర్‌ఎస్‌ నాయకులు అసెంబ్లీలో కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదని వ్యాఖ్యానించారు. తనను ఉంచిన చంచల్‌గూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనే ఉండేవారని అన్నారు. ‘‘డ్రోన్‌ ఎగరేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంపీనని కూడా చూడకుండా నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. కరడు గట్టిన నేరగాళ్లను బంధించినట్లు బంధించారు. 16 రోజులపాటు కంటికి మనిషి కనిపించకుండా నక్సల్స్‌ను ఉంచే డిటెన్షన్‌ సెల్లో ఉంచారు. ఆ కోపాన్ని కూడా బిగపట్టుకున్నా తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదు. జైల్లో రాత్రంతా లైట్లు ఆన్‌లో పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా చేశారు. దీపాల వెలుగుకు బల్లులు, పురుగులు వచ్చి చేరడంతో బలవంతంగా కళ్లు మూసుకున్నా నిద్ర వచ్చేది కాదు. దాంతో పగలు చెట్టు కింద పడుకుని నిద్రపోయే వాడిని. వాళ్ల తప్పులను దేవుడే చూస్తాడని, అంతకు అంత అనుభవిస్తారని భావించి ఊరుకున్నా. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రి పాలు చేశాడు’’ అన్నారు. 2015లో చంచల్‌గూడ జైల్లో ఉన్నపుడు తన బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి బెయిలు కోసం ప్రయత్నిస్తుంటే ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించి వాదనలు చేసి అడ్డుకున్నారని గుర్తు చేశారు. రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఇంత జరిగినా కక్ష సాధింపులకు పాల్పడకుండా విజ్ఞత ప్రదర్శించామని చెప్పారు. కేటీఆర్‌ సొంత పార్టీ ఆఫీసులో కొంత మందికి డబ్బులు ఇచ్చి తనను, తన కుటుంబ సభ్యులను బూతులు తిట్టించి, రికార్డు చేయించిన వారిని చెంప పగులగొట్టే శక్తి ఉన్నా సంయమనంతో వ్యవహరిస్తున్నానన్నారు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం గమనిస్తోందని వ్యాఖ్యానించారు.


గుంటూరు తెలివితేటలొద్దు

ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చలో చివరగా ముఖ్యమంత్రి మాట్లాడినపుడు కూడా కేటీఆర్‌పై ఎదురుదాడికి దిగారు. ఇంగ్లిష్‌ అనేది భాషే తప్ప జ్ఞానం కాదన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న చైనా, జపాన్‌, జర్మనీల్లో ఉండే వారికి ఇంగ్లిష్‌ రాదని చెప్పారు. కేటీఆర్‌ నేర్చుకున్న నాలుగు ఇంగ్లిష్‌ ముక్కలు హోటల్‌లో ఆర్డర్‌ తీసుకునేందుకు, బట్టల దుకాణంలో బట్టలు అమ్మేందుకు అక్కరకు రావొచ్చరన్నారు. గుంటూరులో చదివిన తెలివితేటలు తమ వద్ద చూపించొద్దని హెచ్చరించారు. తెలుగు మీడియంలో గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని వచ్చానని, లోకల్‌ పరిజ్ఞానంతో పని చేస్తున్నానని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకొని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటారని ప్రశ్నించారు. ఈ ఐదేళ్ల తర్వాత రెండోసారి కూడా తామే అధికారానికి వస్తామని రేవంత్‌ అన్నారు. పార్టీ అధినేతగా కేసీఆర్‌ కుర్చీ మీద కేటీఆర్‌, హరీశ్‌ కన్నేయడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. కుటుంబంలో పెద్ద దిక్కు ఉంటేనే ఆ కుటుంబానికి గౌరవం ఉంటుందని, ఆయన్ను ఖతం చేసి కుర్చీలో కూర్చొనే పథకాలు వేయొద్దని సూచించారు. గతంలో నేపాల్‌ యువరాజు దీపేంద్ర తనకు పదవి ఇవ్వలేదనే కోపంతో కుటుంబంలో 8 మందిని ఏకే 47తో కాల్చేశారని, అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో రాకుండా చూడాలని సీఎం రేవంత్‌ రెడ్డి స్పీకర్‌ను కోరారు. రాష్ట్రంలో ఏ ఊరిలో పంట పండినా అది కాళేశ్వరం నీటితోనే పండిందని చెప్పే స్థాయిలో తప్పు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.


పదేళ్ల పాలనతో బేరీజు వేయండి

లక్ష రూపాయల రుణ మాఫీ చేయడానికి కేసీఆర్‌ నాలుగేళ్ల సమయం తీసుకున్నారని రేవంత్‌ అన్నారు. అంతా చేసి రూ.16,143 కోట్లు మాత్రమే మాఫీ చేశారని చెప్పారు. వడ్డీ పక్కనబెడితే కేసీఆర్‌ చేసిన మాఫీ రూ.13,514 కోట్లు మాత్రమే అని చెప్పారు. వీళ్లు తమను రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 25,35,964 మంది రైతులకు రూ.20,616,89 కోట్లు మాఫీ చేసిందని ప్రస్తావించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఎంత మాఫీ చేసింది? పది నెలల్లో కాంగ్రెస్‌ ఎంత మాఫీ చేసింది? చూడాలన్నారు. బీఆర్‌ఎస్‌ ఎగ్గొట్టిన రైతుబంధు రూ.7,625 కోట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక చెల్లించామని చెప్పారు. రూ.4,666.59 కోట్లు రెండో విడత రైతు భరోసా అందించామని, రైతు భరోసాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని తెలిపారు. వరి వేేస్త ఉరి అని చెప్పిన వాళ్లు ఫామ్‌ హౌస్‌లో పండిన వడ్లను క్వింటాల్‌ రూ.4,500 చొప్పున కావేరి సీడ్స్‌ కు అమ్ముకున్నారని ప్రస్తావించారు. దొర వడ్లకు వచ్చిన ధర రైతులకు ఎందుకు రాలేదన్నారు. సన్న బియ్యం పండించే రైతులకు రూ.11 వేల కోట్ల బోనస్‌ ఇచ్చామని చెప్పారు. ఉచిత కరెంట్‌ కాంగ్రెస్‌ పేటెంట్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో చేయలేనివి తాము పది నెలల్లో చేస్తే అభినందించాల్సింది పోయి కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.


నా మీద కోపం ఉండొచ్చు కానీ

కుర్చీని లాక్కున్నందుకు కేసీఆర్‌కు తన మీద కోపం ఉండొచ్చు కానీ మంచి పనులు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆయన అభినందించవచ్చు కదా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో తెలంగాణ ప్రాంత అప్పు రూ.90,160 కోట్లు అయితే, కేసీఆర్‌ హయాంలో పదేళ్లలో రూ.6,69,257 కోట్ల అప్పు చేశారన్నారు. ఇవి కాక, రూ.40,154 కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. మొత్తం కలిపితే రూ.8,19,151 కోట్లు ఉందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పదిహేను నెలల్లో చేసిన అప్పు రూ.1,58,041 కోట్లు అని, అందులో రూ.88,591 కోట్లు పాత అప్పు, రూ.64,768 కోట్లు వడ్డీలు అని వివరించారు. 15 నెలల్లో తమ ప్రభుత్వ నిర్వహణకు చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు.


కాళేశ్వరం కట్టకపోయినా

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోయినా నీరు తరలించేందుకు అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి చెప్పారు. లక్ష కోట్లు కొల్లగొట్టిన ప్రాజెక్టు లేకపోయినా తెలంగాణకు నీళ్లు ఇవ్వవచ్చన్నారు. ప్రాజెక్టుల దగ్గర బీఆర్‌ఎస్‌ నాయకులు వందల ఎకరాలు కొనుగోలు చేశారని చెప్పారు. కొండపోచమ్మ నుంచి ఎర్రవెల్లి ఫాంహౌ్‌సకు కాలువ తీసి నీరు తరలించారని తెలిపారు. ప్రాజెక్టులు కట్టిందే ఫాంహౌ్‌సలకు నీరు పారించడానికని సీఎం ఆరోపించారు. ఏ ప్రాజెక్టుల వద్ద ఎవరికి భూములు, ఫాంహౌ్‌సలు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీతో విచారణ జరిపేందుకు సిద్ధమా? అని బీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెసేతర సభ్యులతోనే నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని సూచించారు. ఫాంహౌ్‌సల చుట్టూ తవ్విన కాలువల వివరాలు బయట పెట్టాలా? అని ప్రశ్నించారు. లగచర్లలో ఎకరానికి రూ.20 లక్షల పరిహారం ఇచ్చామని, బీఆర్‌ఎఎస్‌ మాజీ ఎమ్మెల్యే అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. అధికారుల్ని కొట్టండి, చంపండి, కేటీఆర్‌, హరీశ్‌ చూసుకుంటారని బహిరంగ ప్రకటనలు చేశారని అన్నారు. అత్యంత అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏకసభ్య కమిషన్‌ విచారణ జరుగుతోందని చెప్పారు. విద్యుత్‌ ప్రాజెక్టుపై జరిగిన మోసం మీద కమిషన్‌ నివేదిక వచ్చిందని తెలిపారు. కాళేశ్వరంపై విజిలెన్స్‌ నివేదిక వచ్చిందని, వచ్చే సమావేశాల్లో సభలో ప్రవేశపెడతామని ప్రకటించారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించారంటే ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న కేసీఆర్‌ను ఓడించి సామాన్యుడికి పట్టం కట్టారని ప్రస్తావించారు. కేటీఆర్‌ పది సంవత్సరాలు ఐటీ మంత్రిగా దావోస్‌ వెళ్లి రూ.20 వేల కోట్లు పెట్టుబడులు తెస్తే తాను పది నెలల్లో 2 లక్షల 20 వేల కోట్లు పెట్టుబడులు తెచ్చానని సీఎం తెలిపారు.


ఇవి కూడా చదవండి...

ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 03:21 AM