Share News

Meenakshi Natarajan: మజ్లిస్‌ పార్టీకి కాంగ్రెస్‌ దూరమే

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:33 AM

రాజకీయంగా ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్‌ దూరంగానే ఉంటుందని, ఇది రాహుల్‌ గాంధీ వైఖరి అని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ స్పష్టం చేశారు.

Meenakshi Natarajan: మజ్లిస్‌ పార్టీకి కాంగ్రెస్‌ దూరమే

  • రాజకీయంగా ఇది రాహుల్‌ వైఖరి

  • లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలో మీనాక్షి నటరాజన్‌ వెల్లడి

  • హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ నేతలకు దిశానిర్దేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రాజకీయంగా ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్‌ దూరంగానే ఉంటుందని, ఇది రాహుల్‌ గాంధీ వైఖరి అని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కొన్ని అంశాలపై ఎంఐఎంకు మద్దతుగా ఉన్నంత మాత్రాన ఆ పార్టీతో కలిసినట్టు కాదని వివరించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఎంఐఎం పార్టీకి ప్రాధాన్యం ఇవ్వడంపై అజారుద్దీన్‌, ఫిరోజ్‌ఖాన్‌ తదితర నేతలు ఈ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎంకి ప్రాధాన్యమిస్తే హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఎలా బలోపేతం అవుతుందని అడిగారు. ఇందుకు స్పందించిన మీనాక్షీ నటరాజన్‌.. ఎంఐఎం పట్ల కాంగ్రెస్‌ వైఖరిని వివరించారు. ఇక, పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు అవుతున్నా.. అధికారం వచ్చేందుకు క్షేత్రస్థాయిలో శ్రమించిన నేతలకు ఇప్పటికీ పదవులు రాలేదని, అధికారులు, పోలీసులు తమ మాట వినడం లేదని పలువురు నేతలు మీనాక్షి ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఏళ్లుగా పార్టీలో ఉన్నవారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం లభిస్తోందని వాపోయారు. అలాగే, మంత్రితో ముఖాముఖీ కార్యక్రమం అటకెక్కిందని, మంత్రులు డీసీసీ కార్యాలయాలకు వెళ్లి కార్యకర్తలను కలవడం లేదని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన మీనాక్షీ నటరాజన్‌.. పార్టీ కార్యకర్తే లేకుంటే మంత్రులు లేరని, ప్రభుత్వమూ వచ్చేది కాదని అన్నారు. గాంధీభవన్‌లో మంత్రితో ముఖాముఖీ కార్యక్రమం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు జిల్లా పర్యటనల్లో కార్యకర్తలను కలిసేలా చేస్తామన్నారు. ఎప్పట్నించో పార్టీలో ఉన్నవారికి పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. నేతలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలని, ఇందిరమ్మ కమిటీలను క్రీయాశీలం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్‌ నాయకులు వి.హన్మంతరావు, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. కాగా, చేవెళ్ల, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షీ నటరాజన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహిస్తారు.

Updated Date - Apr 18 , 2025 | 04:33 AM