Share News

వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?

ABN , Publish Date - Feb 27 , 2025 | 05:11 AM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో.. కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్‌ఎ్‌సకు వెళ్లే అవకాశముండగా.. నాలుగింట్లో కాంగ్రెస్‌ పాగా వేయనుంది.

వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?

ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. వాటిల్లో నాలుగు కాంగ్రెస్‌ ఖాతాలోకే!

  • మజ్లి్‌సకు సిటింగ్‌ స్థానాన్ని ఇచ్చేస్తారా?

  • అధిష్ఠానం అందుకు అంగీకరిస్తుందా??

  • సీపీఐకి ఒకస్థానంపై అధిష్ఠానం హామీ

  • ఒక స్థానానికి మాదిగ వర్సెస్‌ మాల

  • ఎంబీసీలకు ఒక సీటిచ్చే అవకాశం

  • ఆర్గనైజేషన్‌ కోటాలో ఒకరికి చాన్స్‌

  • కమ్మ సామాజికవర్గానికి సన్నగిల్లిన ఆశలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో.. కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్‌ఎ్‌సకు వెళ్లే అవకాశముండగా.. నాలుగింట్లో కాంగ్రెస్‌ పాగా వేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు వేంనరేందర్‌రెడ్డికి ఈ సారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే అంచనాలున్నా.. ఒకవేళ సామాజికవర్గాల కూర్పులో ఇబ్బందులు ఎదురైతే.. వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీటుకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అయితే.. వేం నరేందర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

మజ్లి్‌సకు అవకాశమిస్తారా?

ఐదు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి మజ్లిస్‌ సిటింగ్‌ స్థానం. ఇటీవలికాలంలో మజ్లిస్‌ పార్టీ కాంగ్రెస్‌ సర్కారుకు శాసనసభలో, బయట అన్ని విధాలుగా సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో సిటింగ్‌ సీటును తమకే కేటాయించాలని మజ్లిస్‌ అధినాయకత్వం కోరుతున్నట్లు తెలిసింది. అయితే.. కాంగ్రెస్‌ అధిష్ఠానంలో మాత్రం మజ్లి్‌సపై వ్యతిరేకత ఉండడంతో ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ టీపీసీసీ ప్రత్యేకంగా ప్రతిపాదించినా.. అధిష్ఠానం ఓకే చెబుతుందా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న..! ఈ క్రమంలో తమకు మద్దతుగా ఉంటున్న మజ్లి్‌సకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో సీఎం రేవంత్‌రెడ్డి సహకరించే అవకాశాలున్నాయి. రేవంత్‌రెడ్డి పట్టుబడితే.. ఎమ్మెల్యే కోటాలోనే మజ్లి్‌సకు చాన్స్‌ రావొచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


సీపీఐకి ఒక సీటు!

ఒప్పందంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలని సీపీఐ నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఈ విషయమై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపారు. దీనికి అగ్రనేతలిద్దరూ సానుకూలంగా స్పందించారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో సీపీఐకి ఒక సీటు దాదాపుగా ఖాయమేనని స్పష్టమవుతోంది.

రెడ్డి, బీసీ వర్గాలకు లేనట్లేనా?

ముఖ్యమంత్రిది రెడ్డి సామాజికవర్గమే. మంత్రివర్గ విస్తరణలోనూ రెడ్లకు కచ్చితంగా బెర్త్‌ దక్కే అవకాశాలున్నాయి. దీంతో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సారి రెడ్లకు అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఒకవేళ రెడ్లకూ అవకాశం ఉంటే.. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితోపాటు..టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ నేతలు హరివర్ధన్‌రెడ్డి, సామా రామ్మోహన్‌రెడ్డి, మద్ది శ్రీనివా్‌సరెడ్డి తదితరులూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెడ్లకు చాన్స్‌ లేకుంటే.. వేం నరేందర్‌రెడ్డికి వచ్చేఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలున్నాయి. రెడ్లను పరిగణనలోకి తీసుకోకుం టే.. ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని అత్యంత వెనకబడిన కులాల(ఎంబీసీ)కు కేటాయించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎంబీసీలకు కాకుండా.. బీసీలకు మాత్రం సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుక్కారణం.. టీపీసీసీ చీఫ్‌గా బీసీ ఉండడం.. మం త్రివర్గ విస్తరణలో ముదిరాజ్‌ సామాజికవర్గానికి అవకాశం దక్కనుండడమే..! అయితే యాదవ సామాజికవర్గం నుంచి ఇప్పటికే డిమాండ్లు ఉన్నాయి. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్‌, ప్రధానకార్యదర్శి చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ తదితరులు ఎమ్మెల్సీ పదవి కోసం తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మాజీ ఎంపీ వి.హన్మంతరావు పేరు కూడా ప్రస్తావనకు వచ్చినా.. ఏఐసీసీ ఓబీసీ సెల్‌ చైర్మన్‌ పోస్టుపైనే ఆయన ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.


సంస్థాగత కోటా ఎవరికి?

4 సీట్లలో ఒక స్థానాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వారిలో ఒకరికిచ్చే అవకాశాలున్న ట్లు సమాచారం. ఈ కోటాలో టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మాదిగకా? మాలకా?

ఎస్సీ సామాజికవర్గం నుంచి ఒకరు ఎమ్మెల్సీ అవ్వడం దాదాపుగా ఖాయమైంది. అయితే.. మాదిగ వర్గానికి కేటాయించాలా? మాల వర్గానికా? అన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌కు సీటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి సీటు కేటాయించాలన్న అభిప్రాయాన్ని మరి కొందరు పార్టీ ముఖ్యులు తెరపైకి తెచ్చారు. మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే పార్టీ నేతలు దొమ్మాటి సాంబయ్య, రాచమళ్ల సిద్దేశ్వర్‌ కూడా రేసులో ఉన్నారు.


ముస్లింలలో పోటీ ఉన్నా..

ముస్లిం కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలనే డిమాండ్‌లు కూడా రాష్ట్ర కాంగ్రె్‌సను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, పార్టీ నేతలు ఫిరోజ్‌ఖాన్‌, అజ్మతుల్లా తదితరులు రేసులో ఉన్నారు. అయితే.. గవర్నర్‌ కోటాలో ఆమెర్‌ అలీఖాన్‌ను ఎమ్మెల్సీని చేసినందుకు.. ఈ సారి ముస్లింలకు చాన్స్‌ ఉండకపోవచ్చని పార్టీవర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మహిళా కోటాలో కూడా డిమాండ్లు ఉన్నాయి. గతంలో మహేశ్వరం, వైరా సీట్లను ఆశించి టిక్కెట్లు దక్కని పారిజాత నర్సింహారెడ్డి, బాణోతు విజయాబాయి రేసులో ఉన్నారు. వీరితో పాటుగా పార్టీ గడ్డుకాలంలో ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తూ.. గత అధికార పార్టీపై పోరాటాలు కొనసాగించామని, కేసులనూ ఎదుర్కొన్నామని, ఈ దఫా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని జిల్లా స్థాయి నేతల నుంచి రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞాపనలూ అందుతున్నాయి.

మీనాక్షీ నటరాజన్‌తో భేటీ తర్వాతే..

ఈ వారంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల చిట్టా ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఒక్కో సీటుకు ఇద్దరు లేదా ముగ్గురి పేర్లను టీపీసీసీ అధిష్ఠానానికి పంపనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై.. అభ్యర్థుల ఎంపికపై తుది కసరుత్తు చేయనున్నారు. సీపీఐ, మజ్లిస్‌ పార్టీల ప్రతిపాదనలు, అధిష్ఠానం సూచనలు, సోషల్‌ ఇంజనీరింగ్‌, పార్టీ పట్ల అంకిత భావం తదితరాలను పరిగణనలోకి తీసుకుని, కసరత్తును ఒక కొలిక్కి తీసుకురానున్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరగనున్న టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు మీనాక్షీ నటరాజన్‌.. హైదరాబాద్‌కు రానున్నారు. అదే రోజు ఆమె ఢిల్లీకి వెళ్లి పోతారని, మరుసటి పర్యటనలో కసరత్తు పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.


ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు వద్దు : మహేశ్‌గౌడ్‌

గాంధీభవన్‌లో శుక్రవారం జరగనున్న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ విస్తృతస్థాయి సమావేశం.. అత్యంత నిరాడంబరంగా జరుగుతుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వెల్లడించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హోదాలో మీనాక్షీ నటరాజన్‌ తొలిసారిగా వస్తున్నందున.. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఉండవని స్పష్టంచేశారు. ఆమెకు స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, బొకేల అందజేత, శాలువలు కప్పడం వంటి కార్యక్రమాలు వద్దని బుధవారం ఓ ప్రకటనలో సూచించారు.

కమ్మ సామాజికవర్గానికి లేనట్లే?

కమ్మ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ్‌కుమార్‌ పేరు పరిశీలనలో ఉంది. అయితే కమ్మ సామాజిక వర్గం కోటాలో రేణుకాచౌదరికి రాజ్యసభ సీటు ఇప్పటికే ఇచ్చేశామన్న వాదనను కొందరు నేతలు తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమ్మ సామాజికవర్గానికి అవకాశం సన్నగిల్లినట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గానికి సీటు కేటాయించని పరిస్థితుల్లో జెట్టి కుసుమ్‌కుమార్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవిపై హామీ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.


Read Also : టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..

ఇదెక్కడి వింత రైలు.. రోడ్డు మీద నడస్తున్న ఈ విచిత్రాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..

తమిళనాడు సీఎంకు అమిత్ షా కౌంటర్.. 5 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడి

Updated Date - Feb 27 , 2025 | 05:12 AM