Share News

Congress: హామీ.. మంత్రం!

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:54 AM

ఎన్నికల ముందు అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రి పదవులు వస్తాయన్న ధీమాతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌ ఉన్నారు.

Congress: హామీ.. మంత్రం!

  • అధిష్ఠానంపై నమ్మకంతో రాజగోపాల్‌, వివేక్‌ గతంలో రేవంత్‌ ఇచ్చిన హామీలు ఫలిస్తే

  • శ్రీహరి, సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు

  • తాజా విస్తరణలో వీరికి ఖాయమని ప్రచారం

  • ఐదో వ్యక్తికి పదవి ఇవ్వాల్సి వస్తే మైనారిటీకి.. ఆరో పదవి ఇస్తే.. ఆది శ్రీనివాస్‌కు అవకాశం

హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రి పదవులు వస్తాయన్న ధీమాతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌ ఉన్నారు. అలాగే, లోక్‌సభ ఎన్నికలకు ముందు ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఒకరిని మంత్రివర్గంలో తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రి వర్గంలో చోటు గ్యారెంటీ అన్న విశ్వాసంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. నిజామాబాద్‌ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తామన్న రేవంత్‌ ఇచ్చిన హామీ ఫలిస్తే తనకు పదవి గ్యారెంటీ అని సుదర్శన్‌రెడ్డి భావిస్తున్నారు. ఆరు గ్యారెంటీలు సహా పథకాల అమలు, పదవుల పంపకంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి, గడ్డం వివేక్‌, వాకిటి శ్రీహరి, సుదర్శన్‌రెడ్డికి మంత్రి వర్గ విస్తరణలో చోటు గ్యారెంటీ అన్న ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. బీఆర్‌ఎ్‌సను ఓడించేందుకు 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ సర్వ శక్తులను ఒడ్డింది. గెలుపు అవకాశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించిన సునీల్‌ కనుగోలు బృందం.. దానికి అనుగుణంగా వ్యూహాలనూ అమలు చేసింది. అప్పట్లో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావుతో చర్చలు జరిపి.. వారిని పార్టీలో చేర్పించగలిగింది.


ముగ్గురికీ మంత్రి పదవులతోపాటు వారు సూచించిన కొందరికి కార్పొరేషన్‌ పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన అధిష్ఠానం.. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసింది. అలాగే, అప్పుడు బీజేపీలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గరిక పాటి మోహన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులతో సునీల్‌ కనుగోలు బృందం చర్చలు జరపగా.. విశ్వేశ్వర్‌రెడ్డి, గరికపాటి మినహా మిగతా వారందరూ కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇందులో భాగంగానే రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతికి మంత్రి పదవులు, ఏనుగు రవీందర్‌రెడ్డికి పార్టీ టికెట్టు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ మేరకు రాజగోపాల్‌, వివేక్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు.. విజయశాంతికి ఇచ్చిన హామీ మరుగున పడిందని అందరూ అనుకున్న దశలో.. అధిష్ఠానం ఆ హామీకి దుమ్ము దులిపి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. తాజా విస్తరణలో విజయశాంతికి మంత్రి పదవి వస్తుందని ఆమె సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.అలాగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్గంలో ముదిరాజ్‌ సామాజిక వర్గం నుంచి ఒకరికి చోటు కల్పిస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆ సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కనుందని కాంగ్రెస్‌ ముఖ్య నేత ఒకరు చెప్పారు. నిజామాబాద్‌ నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తామన్న రేవంత్‌ హామీ నేపథ్యంలో తనకు పదవి దక్కనుందన్న అంచనాతో సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. ఈ నలుగురి విషయంలో అధిష్ఠానం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే.. హామీ మేరకు మంత్రి పదవులు పొందే వారి సంఖ్య ఏడుకు చేరనుంది. ఇక, తాజా విస్తరణలో ఐదో వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మైనారిటీకి, ఆరో వ్యక్తికి పదవి ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌సకు అవకాశం దక్కనుందన్న చర్చ సాగుతోంది.


సీపీఐ, టీజేఎ్‌సలకూ హామీలు

ఎన్నికల ముందు సీపీఐకీ ఒక ఎమ్మెల్యే సీటు, మంత్రివర్గంలో చోటు ఇస్తామంటూ కాంగ్రెస్‌ అధిష్ఠానం హామీ ఇచ్చింది. అయితే మంత్రి పదవి కంటే.. చట్ట సభల్లో ప్రాతినిథ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన సీపీఐ నాయకత్వం.. రెండు ఎమ్మెల్సీ పదవులకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి సీపీఐకి కేటాయించింది. అలాగే, టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌కూ ఎమ్మెల్సీ సీటు, మంత్రి పదవి, కొన్ని నామినేటెడ్‌ పోస్టులను ఆఫర్‌ చేసింది. ఈ మేరకు కోదండరామ్‌కు ఎమ్మెల్సీ సీటుతోపాటు కొందరికి నామినేటెడ్‌ పోస్టులను ఇచ్చింది.


మంత్రుల ఆశీర్వాదాలు తీసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రానున్న మంత్రివర్గ విస్తరణలో బీసీ జాబితాలో కచ్చితంగా మంత్రి అవుతారని ప్రచారంలో ఉన్న మక్తల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ బుధవారం శాసనసభలో సీనియర్‌ మంత్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం శాసనసభ ప్రారంభం కావడానికి ముందు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదాలు పొందారు.

Updated Date - Mar 27 , 2025 | 03:54 AM