Congress Protest: సోనియా, రాహుల్‌పై మోదీ కక్ష సాధింపు
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:39 AM
పార్లమెంట్ సాక్షిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించబోతున్నామని రాహుల్ గాంధీ ప్రకటించడంతోనే మోదీ ప్రభుత్వానికి భయం పుట్టుకుందని, అందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీలను చేర్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆరోపించారు.
గుజరాత్‌లో ఓటమి భయంతోనే కేసులు.. ఈడీ ఆఫీసు వద్ద ధర్నాలో మీనాక్షీ నటరాజన్
కులగణనను అడ్డుకోవడానికే కేసులు : భట్టి
గన్‌పార్కు నుంచి ఈడీ ఆఫీసుకు కాంగ్రెస్ ర్యాలీ
మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బైఠాయించి ధర్నా
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : పార్లమెంట్ సాక్షిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించబోతున్నామని రాహుల్ గాంధీ ప్రకటించడంతోనే మోదీ ప్రభుత్వానికి భయం పుట్టుకుందని, అందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీలను చేర్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చార్జిషీట్‌లో చేర్చినందుకు నిరసనగా గురువారం టీపీసీసీ ఆధ్వర్యంలో గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈడీ ఆఫీసు ఎదుట మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నేతలు బైఠాయించి ధర్నా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ కుమార్‌గౌడ్ సారథ్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతూ.. గుజరాత్‌లో ఓడిపోతే ఆ ప్రభా వం దేశవ్యాప్తంగా పడుతుందనే భయంతోనే అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, ఈ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలే మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. దేశంలో కులగణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్‌షాల డైరెక్షన్‌లోనే సోనియా, రాహుల్‌ఫై ఈడీ చార్జిషీటు దాఖలు చేసిందని మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మోదీ దేశ సంపదను అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని, దానిని వ్యతిరేకిస్తే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాహుల్, సోనియాలపై అక్రమ కేసులు బనాయించారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, మంత్రి తుమ్మల, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శంకరయ్య, రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్, కార్పొరేషన్ల చైర్మన్‌లు పాల్గొన్నారు.
జిల్లాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం పలు జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వరంగల్, భూపాలపల్లి, నల్లగొండ, యాదాద్రి, ఖమ్మం, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో నిరసన ఆందో ళనలు నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.