Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:57 AM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలతో పార్టీ విధానాలను ఉల్లంఘించడం

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు
కులగణన సర్వేపై విమర్శల ఫలితం
ఎంతటివారైనా పార్టీ లైన్ దాటితే.. సహించేది లేదు: మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలతో పార్టీ విధానాలను ఉల్లంఘించడం, ఇందుకు సంబంధించి పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తీన్మార్ మల్లన్న కులగణన సర్వే సహా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడంతోపాటు ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన తీరుపై పార్టీ నాయకత్వానికి పలు ఫిర్యాదులందాయి. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5న ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి వారం రోజుల్లో (ఫిబ్రవరి 12లోగా) రాతపూర్వకంగా సమాధానం చెప్పాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి ఆదేశించారు.
అయితే ఫిబ్రవరి నెలాఖరు దాకా మల్లన్న నుంచి కమిటీకి ఎలాంటి సమాధానం అందలేదు. అంతేకాకుండా షోకాజ్ నోటీసును ఖాతరు చేయకుండా ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలను మల్లన్న కొనసాగించారు. దీనిని తీవ్రంగా పరిగణించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంటూ చిన్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా సహించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను క్రమశిక్షణ విషయంలో పార్టీ ఎన్నోసార్లు హెచ్చరించిందని, అయినా ఆయన తీరు మార్చుకోలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే నివేదిక ప్రతులను చింపివేయడాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించిందన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు ముమ్మాటికీ తప్పు అన్నారు. పార్టీ నిర్ణయాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని, సొంత అభిప్రాయాలను పార్టీపై రుద్దితే ఫలితం అనుభవించక తప్పదని స్పష్టం చేశారు.