Share News

Cyber Security Bureau: సోషల్‌ మీడియా పోస్టులపై సైబర్‌ ‘నిఘా’

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:45 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వంపై సోషల్‌ మీడియా వేదికల్లో పెడుతున్న పోస్టులపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో నిఘా పెడుతున్నది.

Cyber Security Bureau: సోషల్‌ మీడియా పోస్టులపై సైబర్‌ ‘నిఘా’

  • పలు చోట్ల నమోదైన కేసులు.. తెర వెనుక సూత్రధారుల కోసం ఆరా

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వంపై సోషల్‌ మీడియా వేదికల్లో పెడుతున్న పోస్టులపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో నిఘా పెడుతున్నది. సీఎంతోపాటు మంత్రులు, ప్రభుత్వం, ప్రభుత్వంలో కీలక వ్యక్తులపై వివిధ సోషల్‌ మీడియా వేదికల్లో అనుచిత , అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వ్యక్తులపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. కొందరు పథకం ప్రకారం సోషల్‌ మీడియా వేదికల్లో పోస్టులు చేస్తున్నారు. మరి కొందరు ఆయా పోస్టులను షేర్‌ చేస్తున్నారు. పోస్టులు పెడుతున్న, షేర్‌ చేస్తున్న వ్యక్తుల నెట్‌వర్క్‌ను గుర్తించడంపై సైబర్‌ సెక్యూరిటీ అధికారులు దృష్టిపెట్టారు. ఈ నెట్‌వర్క్‌ వెనుక సూత్రధారులెవరన్నది గుర్తించేందుకు నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. ‘ఎక్స్‌’లో అమెరికా నుంచి నిర్వహిస్తున్న నిప్పుకోడి అనే ఖాతాపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేస్తూ పలు పోస్టులు పెట్టిన నిప్పుకోడి హ్యాండిల్‌ నిర్వాహకులపై హన్మకొండలో కేసు రిజిస్టరైంది.


సీఎం సీపీఆర్‌వో అయోధ్యరెడ్డి కూడా నిప్పుకోడి ఖాతాలో వచ్చిన పోస్ట్‌పై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమిషన్లు తీసుకుంటున్నారనే అర్థం వచ్చేలా సీఎంపై నల్లబాలు అనే వ్యక్తి చేసిన పోస్ట్‌ మీద సైబర్‌ క్రైం పోలీస్‌ కానిస్టేబుల్‌ వాసిం ఫిర్యాదుతో కేసు రిజిస్టర్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక హ్యాండిల్‌ పెట్టిన పోస్టును నల్లబాలు రీపోస్ట్‌ చేయడంతో ఈ కేసు నమోదైంది. అసలు విషయాలను పేరడీ చేస్తూ ఒక యూట్యూబ్‌ చానల్‌ విడుదల చేస్తున్న వీడియోలపై కరీంనగర్‌ పోలీసులు కేసుపెట్టారు. సీఎం రేవంత్‌ను టార్గెట్‌ చేస్తూ తెలంగాణ గుంపు మేస్ర్తీ, కేసీవీపీ, డిగ్‌టీవీలపై సిద్దిపేట సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ వాసి అశోక్‌ రెడ్డి.. సీఎం రేవంత్‌ను లక్ష్యంగాచేసి పెట్టిన పోస్టులపై రామగుండంలో కేసు పెట్టారు. వ్యక్తిత్వ హననం, పరువు తీయడం, బెదిరింపుల దిశగా సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టుల వెనుక గుట్టును వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 04:45 AM