Khammam: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:34 AM
ఖమ్మం జిల్లా వైరాలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. సర్వే పేరుతో వచ్చిన నలుగురు అగంతకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి, ఆమెను బంధించి రూ.15లక్షల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. వైరా లీలాసుందరయ్యనగర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది.

ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి
రూ.15లక్షల విలువైన ఆభరణాల అపహరణ
వైరా, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా వైరాలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. సర్వే పేరుతో వచ్చిన నలుగురు అగంతకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి, ఆమెను బంధించి రూ.15లక్షల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. వైరా లీలాసుందరయ్యనగర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. కొత్తగూడెంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకునిగా పని చేసే శీలం యుగేందర్ రెడ్డి తన భార్య లలిత, తల్లి వెంకట్రావమ్మ(65)తో కలిసి వైరాలోని లీలాసుందరయ్యనగర్‌లో నివాసముంటున్నారు. లలిత సమీపంలోని విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంటారు. దంపతులిద్దరూ బుధవారం ఉదయం ఎప్పట్లాగే విధులకు వెళ్లిపోగా వెంకట్రావమ్మ మాత్రమే ఇంట్లో ఉంది. ఉదయం 11 గంటల సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఆ ఇంటికి వచ్చారు.
తాము కుటుంబసభ్యుల సర్వే వివరాల కోసం వచ్చామని వెంకట్రావమ్మకు చెప్పగా నమ్మిన ఆమె వారు అడిగిన వివరాలను చెప్పింది. అనంతరం వెంకట్రావమ్మ తిరిగి ఇంట్లోకి వెళుతుండగా.. అగంతకులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి నోటికి ప్లాస్టర్ వేసి పడకగదిలోకి తీసుకెళ్లి మంచంపై పడేశారు. ఇద్దరు అగంతకులు ఆమె మొఖంపై దుప్పటి వేసి.. ఆమెపై కూర్చొని పిడిగుద్దులు గుద్దారు. మరో ఇద్దరు బీరువాలోని 18 తులాల బంగారు ఆభరణాలను చేజిక్కించుకున్నారు. వెంకట్రావమ్మ మెడలోని గొలుసు ఇతర వస్తువులను లాగేసుకున్నారు. అనంతరం వెంకట్రావమ్మను అలానే పడేసి గది గడియ పెట్టి వచ్చిన కారులో ఉడాయించారు. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికొచ్చిన వెంకట్రావమ్మ కోడలు లలిత.. ఆమెను విడిపించింది. వైరా ఏసీపీ ఎంఏ.రెహ్మాన్, సీఐ నున్నావత్ సాగర్ బాధితురాలితో మాట్లాడి కేసు దర్యాప్తు చేపట్టారు.