Human Rights: ఆ నలుగురు రాజకీయ ఖైదీలకు జీవించే హక్కు కల్పించాలి
ABN , Publish Date - Jan 12 , 2025 | 05:30 AM
మావోయిస్టు నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలపై వేర్వేరు కేసుల్లో వివిధ ప్రాంతాల నుంచి అరెస్టు చేసిన సంజయ్ దీపక్‌రావు
సీఏఎస్ఆర్ డిమాండ్
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలపై వేర్వేరు కేసుల్లో వివిధ ప్రాంతాల నుంచి అరెస్టు చేసిన సంజయ్ దీపక్‌రావు, అమితాబ్ బాగ్చీ, దేవేందర్‌రెడ్డి, కర్తం జోగా అనే రాజకీయ ఖైదీలకు జైలులో గౌరవంగా జీవించే హక్కును కల్పించాలని పలు పౌర హక్కుల సంఘాలు, పత్రికలతో కూడిన రాష్ట్ర అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (సీఏఎ్‌సఆర్) డిమాండ్ చేసింది. హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఉన్న సంజయ్ దీపక్‌రావు(60), అమితాబ్ బాగ్చీ(72), చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్న కర్తం జోగా(57), జగదల్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న దేవేందర్‌రెడ్డి(66) పట్ల జైలు అధికారులు నిర్లక్ష్య వైఖరితో వహిస్తున్నారని, వారి ప్రాథమిక అవసరాలను తిరస్కరిస్తున్నారని సీఏఎ్‌సఆర్ ఆరోపించింది.
వీరి పట్ల జైలు అధికారులు, రాజ్యం దుర్మార్గంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఈ నలుగురికి అవసరమైన వైద్య సేవలు, ప్రాథమిక సౌకర్యాలు అందించాలని... జైలు నియమాలు పాటించాలని, దేవేందర్‌రెడ్డికి మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. విచారణలో ఉన్న రాజకీయ ఖైదీలపై వేధింపులను ఖండించడానికి, రాజకీయ ఖైదీలందరి విడుదల కోసం పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామిక సంస్థలు, వ్యక్తులు కలిసి రావాలని విజ్ఞప్తి చేసింది.