ICMR: ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ డైరెక్టర్‌గా డాక్టర్ భారతీ కులకర్ణి
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:25 AM
భారత వైద్య పరిశోధన మండలి- జాతీయ న్యూట్రిషన్ సంస్థ (ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్) నూ తన డైరెక్టర్‌గా డాక్టర్ భారతీ కులకర్ణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): భారత వైద్య పరిశోధన మండలి- జాతీయ న్యూట్రిషన్ సంస్థ (ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్) నూ తన డైరెక్టర్‌గా డాక్టర్ భారతీ కులకర్ణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్‌లో 20 ఏళ్లపాటు శాస్త్రవేత్తగా పనిచేసిన భారతీ కులకర్ణి.. గడచిన మూడేళ్లుగా న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్‌లో రీప్రొడక్టివ్, చైల్డ్ హెల్త్-న్యూట్రిషన్ విభాగం అధిపతిగా వ్యవహరిస్తున్నారు. పుణె యూనివర్సిటీలో పీడియాట్రిక్స్ విద్యనభ్యసించిన భారతి.. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ చేశారు. దీంతోపాటు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. కాగా, డాక్టర్ భారతి పరిశోధనలు ఎక్కువగా ప్రసూతి, శిశు పోషణ, రక్తహీనత, బాల్యంలో పోషకాహార లోపం, వ్యవసాయం-పోషకాహార సంబంధం తదితర అంశాలపై జరిగాయి.
దేశంలో పోషకాహార విధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో ఆమె పరిశోధనలు విశేషంగా తోడ్పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రభావవంతమైన పలు జర్నల్స్‌లో డాక్టర్ భారతి 130కి పైగా పరిశోధనా పత్రాలను రాయడంతోపాటు విధాన నిర్ణయ పత్రాల రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించారు. తాను చేసిన సేవలకుగాను పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పరిశోధన గ్రాంట్లు పొందారు. కాగా, కొత్త సంవత్సరం తనకు కొత్త బాధ్యతలను కూడా వెంటబెట్టుకొని వచ్చిందని, దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సంస్థకు సారథ్యం వహించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ భారతి తన లింక్డిన్ ఖాతాలో పేర్కొన్నారు.