Share News

Kukatpally: మద్యం మత్తులో యువతుల హల్‌చల్‌!

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:48 AM

ఆ ముగ్గురు యువతులు మద్యం మత్తులో ఉన్నారు. పైగా కార్లో కొన్ని బీరు బాటిళ్లు పెట్టుకొని బయలుదేరారు. తాగిన మత్తులో కారు అదుపు తప్పనే తప్పింది.

Kukatpally: మద్యం మత్తులో యువతుల హల్‌చల్‌!

  • కారుతో రెండు బైక్‌లను ఢీకొట్టిన వైనం

  • ఉల్టా ఓ బాధితుడితో వాగ్వాదం

  • డ్రంకెన్‌ డ్రైవ్‌ కింద కేసు నమోదు

హైదర్‌నగర్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): ఆ ముగ్గురు యువతులు మద్యం మత్తులో ఉన్నారు. పైగా కార్లో కొన్ని బీరు బాటిళ్లు పెట్టుకొని బయలుదేరారు. తాగిన మత్తులో కారు అదుపు తప్పనే తప్పింది. ఎదురుగా వెళుతున్న ఓ స్కూటీని.. అదే వేగంలో మరో బైక్‌నూ ఢీకొట్టారు. ఇలా మద్యం మత్తులో ముగ్గురు యువతులు కారుతో కూకట్‌పల్లి జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి పదింటికి కూకట్‌పల్లి నుంచి జేఎన్‌టీయూ వైపు వస్తున్న కారు.. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ వద్ద బీభత్సం సృష్టించింది.


పైగా కారు డ్రైవింగ్‌ సీట్లోంచి దిగిన యువతి, ఉల్టా బాధితుడైన ఓ వాహనదారుడినే బెదిరిస్తూ వాగ్వాదానికి దిగింది. స్థానికులు గుమిగూడి కారులో చూడగా బీరు క్యాన్లు కనిపించాయి. లోపల మద్యం మత్తులో ఉన్న మరో ఇద్దరు యువతులను గుర్తించారు. పోలీసులకు సమాచారమివ్వగా వారొచ్చి కారు నడిపిన యువతికి డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించారు. రీడింగ్‌ 212 పాయింట్లు రావడంతో కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 08 , 2025 | 03:48 AM