Hussainsagar: హుస్సేన్‌సాగర్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:07 AM
గణతంత్ర దినోత్సవ వేళ.. భరతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

భరతమాత మహా హారతి కార్యక్రమంలో అపశ్రుతి
రెండు బోట్లలో బాణసంచా కాలుస్తుండగా ఘటన
ఐదుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
ఒక బోటు పూర్తిగా దగ్ధం
హైదరాబాద్ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవ వేళ.. భరతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమం పూర్తయిన తరువాత హుస్సేన్‌సాగర్‌లోకి రెండు బోట్లలో వెళ్లి.. బాణసంచా కాలుస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. నిప్పురవ్వలు తిరిగి అవే బోట్లలో ఉంచిన బాణసంచాపై పడటంతో బోట్లకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు బోట్లు దగ్ధం కాగా.. వాటిలో వెళ్లిన ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే కార్యక్రమం పూర్తయ్యాక పీపుల్స్ ప్లాజా సమీపంలో వేదిక వెనుక భాగంలో బాణసంచా కాల్చేందుకు పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లలో సామగ్రిని హుస్సేన్‌సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు.
బోటులో డ్రైవర్, వాల్టర్, సిబ్బంది, బాణసంచా కాల్చే ఐదుగురు నిపుణులతోపాటు 15 మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. అయితే బాణసంచా కాల్చే క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో బోట్లలో ఉన్న కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు నీళ్లలోకి దూకారు. రంగంలోకి దిగిన అధికారులు.. జెట్టీలో మంటలను అదుపులోకి తెచ్చే పరికరాలు లేకపోవడంతో వారిని స్పీడ్‌బోట్‌లో బయటకు తీసుకువచ్చారు. అయితే ప్రమాదంలో బాణసంచా కాల్చే నిపుణుడు గణపతి (22)కి తీవ్ర గాయాలయ్యాయి. ఇతనితోపాటు ప్రమాదంలో గాయపడిన చింతల కృష్ణ(47), కరీంనగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి సాయిచంద్‌ను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గణపతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, సీతాఫల్‌మండికి చెందిన బీజేపీ కార్యకర్తలు సునీల్, ప్రణీత్‌లకు స్పల్ప గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, కాలిపోయిన లూంబిని బోట్ విలువ రూ.12 లక్షలు ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..
Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి