Hyderabad: నిధుల వరద.. భాగ్యనగరానికి భారీగా కేటాయింపులు
ABN , Publish Date - Mar 20 , 2025 | 07:58 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాజధాని నగరం హైదరాబాద్ కు నిధుల వరద పారింది. హైదరాబాద్ రైజింగ్ పేరిట ఇక్కడ ప్రపంచస్థాయి ప్రమాణాలు కల్పించాలని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అదే స్థాయిలో నిధులు కేటాయించింది.

- బడ్జెట్‌లో రూ.10వేల కోట్లకు పైగానే నిధులు
- వాటర్‌బోర్డుకు అత్యధికంగా రూ.3,385 కోట్లు
- జీహెచ్‌ఎంసీ, మూసీ, మెట్రోరైలుకూ భారీగానే
- మహానగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ సిటీ: భాగ్యనగరానికి నిధుల వరద పారింది. హైదరాబాద్ రైజింగ్ పేరిట ఇక్కడ ప్రపంచస్థాయి ప్రమాణాలు కల్పించాలని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అదే స్థాయిలో నిధులు కేటాయించింది. ప్రధానంగా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే జలమండలికి, మౌలిక సదుపాయాలు కల్పించే జీహెచ్‌ఎంసీకి ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవం, మెట్రోరైలు నిర్మాణంతోపాటు హెచ్‌ఎండీఏ, హైడ్రా, కుడా వంటి వ్యవస్థలకు సైతం వెన్నుదన్నుగా నిలిచింది. రాష్ట్ర ఆదాయంలో సింహభాగాన్ని అందిస్తున్న మహానగర అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10వేల కోట్లకు పైగానే కేటాయించడంపై హర్షం వ్యక్తం అవుతోంది.
ఈ వార్తను కూడా చదవండి: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
ఉస్మానియా నిర్మాణానికి రూ.2,700 కోట్లు, నిమ్స్, ఎంఎన్‌జేలకూ కేటాయింపులు
ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి రూ.2,700 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌లో భట్టి ప్రస్తావించారు. నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి, పరికరాల కొనుగోలు, నిర్మాణ పనులు, ఆధునీకరణ తదితర అంశాలకు దాదాపు రూ.27కోట్లు కేటాయించారు. ఎంఎన్‌జే అభివృద్ధి పనులకు రూ.64 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు భోజనం కోసం మరో రూ.40 కోట్లు కేటాయించారు.
వాటర్‌బోర్డుకు బాసట
రూ.3,385 కోట్లు కేటాయింపు
రుణాల కోసమే రూ.2,085 కోట్లు
కూలిన సుంకిశాలకు రూ.వెయ్యి కోట్లు
ఉచిత తాగునీటి పథకానికి రూ.300 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో వాటర్‌బోర్డుకు రూ.3,385 కోట్లను కేటాయించి ప్రభుత్వం బాసటగా నిలిచింది. అందులో అప్పుల చెల్లింపుల కోసమే రూ.2,085 కోట్లను కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏ సంస్థకూ దక్కని నిధులు బోర్డుకు దక్కడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదేస్థాయిలో నిధులు కేటాయించారని పేర్కొంటున్నారు. కూలిపోయిన సుంకిశాల ప్రాజెక్టుకు మాత్రం గతేడాది మాదిరిగానే వెయ్యి కోట్లు కేటాయించారు.
ఉచిత తాగునీటికి రూ.300కోట్లు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంలో సీఎం కేసీఆర్ హామీ మేరకు 2021 డిసెంబర్ నుంచి గృహ కనెక్షన్లకు నెలకు 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో 4.9 లక్షల గృహ కనెక్షన్ల ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు కూడా ఈ పథకానికి రూ.300 కోట్లు కేటాయించింది.
రుణాల చెల్లింపులకే రూ.2,085 కోట్లు
ఎల్లంపేట నుంచి గోదావరి జలాలను, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను మూడు ఫేజ్‌ల్లో హైదరాబాద్‌కు తరలించడానికి వాటర్‌బోర్డు పెద్దఎత్తున రుణాలు తీసుకుంది. ఆ రుణాల చెల్లింపుల కోసమే బడ్జెట్‌లో రూ.2,085 కోట్లను కేటాయించారు.
జీహెచ్‌ఎంసీకి రూ.3,101.21 కోట్లు
హెచ్-సిటీకి మరోసారి రూ.2,654 కోట్లు
ఆస్తుల సేకరణకూ నిధులు.. గతంతో పోలిస్తే భారీగా కేటాయింపులు
పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంతో పోలిస్తే అధికం
గ్రేటర్‌లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో కీలకమైన జీహెచ్‌ఎంసీపై సర్కారు మరోసారి కరుణ చూపింది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి రూ.3,101.21 కోట్లు కేటాయించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో జరిగిన కేటాయింపులతో పోలిస్తే ఇవి అధికం. ఐఏఎ్‌సల వేతనాలు, భత్యాల కోసం ఎస్టాబ్లి్‌షమెంట్ వ్యయంగా మరో రూ.12.15 కోట్లు ఇవ్వనున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ), ఆస్తుల సేకరణ, కేపిటల్ వర్క్స్, రుణాల చెల్లింపు, వృత్తి పన్ను పరిహారం తదితర కేటగిరీల్లో రూ.7,582 కోట్లు కేటాయించాలని బల్దియా కోరింది. కాగా, హెచ్-సిటీ ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.2,654 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ హెచ్-సిటీకి రూ.2654 కేటాయించగా.. ఇప్పటి వరకు రూ.1600 కోట్లు ఇచ్చినట్టు బల్దియా ఆర్థిక విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.7,032 కోట్లతో వంతెనలు, అండర్‌పా్‌సలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
రూ.419 కోట్లు
10 లక్షల జనాభా దాటిన నగరాలకు ప్రత్యేకంగా ప్లానింగ్ కమిషన్ గ్రాంట్లు కేటాయిస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రూ.419 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇవ్వనున్నట్టు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
మెట్రోకు ఊతం.. రూ.1,100 కోట్ల కేటాయింపు
రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రోరైలుకు ఊతం లభించింది. రెండో దశలోని 5 కారిడార్లకు సుమారు రూ.3వేల కోట్ల ప్రతిపాదనలు పంపించగా, అందులో రూ.600 కోట్లు కేటాయించింది. అలాగే హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు రుణసాయం కింద రూ.500 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.1,100 కోట్లు ఈ బడ్జెట్‌లో ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇటు అధికారులు, అటు నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మూసీ సుందరీకరణకు..
మూసీనది పునరుజ్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.1500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించడంతో తొలిదశలో నార్సింగి నుంచి బాపూఘాట్ వరకు మూసీ సుందరీకరణకు అడుగులు పడనున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు నిదర్శనం. ముంపు ముప్పు తొలగిపోయేలా భారీగా నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుకు ధన్యవాదాలు.
- గద్వాల్ విజయలక్ష్మి, మేయర్
ఎంఎంటీఎస్ కు రూ.50 కోట్లు
నగరంలో చౌక ప్రయాణానికి చిరునామాగా నిలిచిన మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ (ఎంఎంటీఎస్) విస్తరణకు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్‌లోనూ రూ.50 కోట్లు కేటాయించి అందులో రూ.25కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది.
హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు
ఔటర్ అప్పులకు రూ.200కోట్లు
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.500కోట్లు కేటాయించింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ వరకు, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు రెండు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి గతేడాది శంకుస్థాపన చేశారు. ప్యారడైజ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే రూ.652కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రూ.500కోట్ల మేర నిధులు కేటాయించడం ఉపశమనంగా అధికారులు భావిస్తున్నారు. అలాగే, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం చేసిన రుణాల కోసం రూ.200 కోట్లను కేటాయించారు.
రుణాల చెల్లింపులకే రూ.2,085 కోట్లు
ఎల్లంపేట నుంచి గోదావరి జలాలను, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను మూడు ఫేజ్‌ల్లో హైదరాబాద్‌కు తరలించడానికి వాటర్‌బోర్డు పెద్దఎత్తున రుణాలు తీసుకుంది. ఆ రుణాల చెల్లింపుల కోసమే బడ్జెట్‌లో రూ.2,085 కోట్లను కేటాయించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పైసలు తక్కువ.. ప్రచనాలు ఎక్కువ..
పూత నిలవదు.. పిందె కనిపించదు..
రేవంత్ కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు