Share News

Harish Rao: కాంగ్రెస్‌ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం

ABN , Publish Date - Mar 16 , 2025 | 03:35 AM

కాంగ్రెస్‌ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ ఆరోపించారు. ‘‘నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు.

Harish Rao: కాంగ్రెస్‌ వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం

  • సభలో మంత్రి ఉత్తమ్‌ పచ్చి అబద్ధాలు

  • మీడియాతో చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ ఆరోపించారు. ‘‘నీటి పారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు 299 టీఎంసీల వాటా వచ్చింది. రాష్ట్రంలో 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి తెలంగాణకు ఆ మేరకే తాత్కాలికంగా కేటాయించారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రె్‌సదే’’ అన్నారు. అసెంబ్లీ లాబీలో హరీష్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. పోతిరెడ్డిపాడు కోసం పీజేఆర్‌ కొట్లాడితే ఉత్తమ్‌ పదవుల కోసం పెదవులు మూసుకున్నారని చెప్పారు.


పీజేఆర్‌ తప్ప తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులెవరూ పోతిరెడ్డిపాడును వ్యతిరేకించలేదని అన్నారు. 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశామని, మంత్రి పదవులు వదులుకున్నామని ప్రస్తావించారు. ఉత్తమ్‌ చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చారన్నారు. సెక్షన్‌ 3ని సాధించింది కేసీఆరేనని, 573 టీఎంసీల నీళ్లు సెక్షన్‌ 3 ద్వారా తెచ్చామని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మీద స్టే తెచ్చింది బీఆర్‌ఎస్‌ అన్నారు. ప్రస్తుతం నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెసేనని ఆరోపించారు. కేసీఆర్‌ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మంకి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌కి అన్యాయం చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 03:35 AM