Harish Rao: అబుదాబికి.. పెళ్లికి వెళ్లాను
ABN , Publish Date - Mar 03 , 2025 | 03:47 AM
సీఎం రేవంత్‌రెడ్డి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
రేవంత్‌కు కనీస మానవ విలువలు లేవు
వైఫల్యాల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద స్థలానికి వెళ్లకుండా ఎన్నికల రాజకీయాల్లో మునిగి తేలారు
పాలమూరుకు కాంగ్రెస్ చేసిందేంటి?
సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు మండిపాటు
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడాన్ని అలవాటుగా చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కర్తవ్యం మరిచి ఎన్నికల రాజకీయాల్లో మునిగితేలిన ముఖ్యమంత్రి.. తాను తన స్నేహితుడి కూతురి పెళ్లికి అబుదాబికి వెళ్లడాన్ని కూడా వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇది రేవంత్ నీచత్వానికి పరాకాష్ఠ అని ధ్వజమెత్తారు. ఈ మేరకు హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద స్థలానికి వెంటనే వెళ్లకుండా బాధ్యత మరిచి ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యమిచ్చారని, తొమ్మిది రోజుల తరువాత వెళ్లి ఇప్పుడు బీఆర్‌ఎ్‌సపై, తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అబుదాబికి వెళ్లింది క్రికెట్ మ్యాచ్‌లు చూడడానికో, విహారయాత్రలకు, విలాసాలకో కాదని, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లానని తెలిపారు. తాను ఫిబ్రవరి 21న వెళితే.. ప్రమాద ఘటన ఆ నెల 22న జరిగిందన్నారు. ప్రమాద స్థలానికి వెళ్లడానికి హెలికాప్టర్ లేదనే కారణంతో ఇరేషన్ మంత్రి అక్కడకి పోకుండా హైదరాబాద్‌లో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉండి కూడా బాధ్యత మరచి, కనీస మానవ విలువలు పాటించకుండా ప్రవర్తించిన వారు.. తనను ఆడిపోసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తాను బాధ్యతాయుతంగా వ్యవహరించానని తెలిపారు. ప్రమాదం జరిగి 9 రోజులు గడిచినా కార్మికులను కాపాడకపోగా, కనీసం వారి మృతదేహాలను బయటకు తీయలేని చేతగాని ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా శాంతిభద్రతలపై దృష్టి సారించకుండా.. ప్రతిపక్ష నాయకుల కదలికలను తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.
పాలమూరుకు ఏం ఒరగబెట్టారు?
సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే పాలమూరు బిడ్డనని శుష్క సెంటిమెంట్‌ను వల్లించడం తప్ప పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదని హరీశ్‌రావు అన్నారు. వనపర్తిలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రకటనలో స్పందిస్తూ.. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా రేవంత్‌రెడ్డి మాట్లాడడం లేదన్నారు. ‘‘కేసీఆర్‌ను, బీఆర్‌ఎ్‌సను విమర్శించడం కాదు.. కృష్ణాజలాలను అక్రమంగా తరలించుకుపోతున్న ఏపీ చర్యలకు అడ్డుకట్ట వేయి. నీటికోసం చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. మేం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మర్యాదపూర్వక సంబంధాలు నెరిపాం. నీలాగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున సూట్‌కేసులు మోయలేదు. ప్రజాభవన్‌లో కూర్చోబెట్టి పాదసేవ చేయలేదు.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదు’’ అని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని ఆరోపించారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకొని, భూసేకరణ కూడా పూర్తిచేయని దగాకోరు చరిత్ర కాంగ్రె్‌సదన్నారు. కాంగ్రెస్ హయాంలో నత్తనడక నడిచిన పనులను పరిగెత్తించి పూర్తిచేసింది బీఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. పదేళ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన విషయాలను పట్టించుకోకుండా ఆదర బాదరాగా ఎస్‌ఎల్బీసీ పనులు చేపట్టారని, కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యు కుహరంలోకి నెట్టారని ఆరోపించారు. వారి ప్రాణాలను బలి తీసుకొని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారని మండిపడ్డారు.
సన్‌ఫ్లవర్ రైతుల కష్టాలు పట్టవా?: హరీశ్
హైదరాబాద్/సిద్దిపేట కలెక్టరేట్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. వెంటనే రాష్ట్రమంతటా సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతులను కష్టపెట్టొద్దని అన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు లేఖ రాశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.