Harish Rao: పోలీసుల పహారాలో గ్రామసభలా?
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:23 AM
పోలీసుల పహారా మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారని, ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

సర్కార్ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత: హరీశ్‌రావు
సిద్దిపేట టౌన్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పోలీసుల పహారా మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారని, ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్‌లైన్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని 15వ వార్డు లింగారెడ్డిపల్లిలో నిర్వహించిన వార్డు సభకు హాజరైన ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రొటోకాల్ పాటించడం లేదని, గ్రామసభల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోటో పెడుతున్నారు గాని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర పొటోలు పెట్టడం లేదన్నారు. ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారని, ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని ఆయన అన్నారు.
రైతుల రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే యాసంగి, వానాకాలానికి కలిపి రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అర్హులైన అందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని, ఏడాదికి ఐదు లక్షల ఇళ్లు కడతామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. అధిరానంలోకి వచ్చి ఏడాది పూర్తైన ఒక్క ఇల్లయిన ప్రభుత్వం కట్టిందా అని ఆయన ప్రశ్నించారు.