Harish Rao: సర్కారు వైఫల్యమే
ABN , Publish Date - Feb 28 , 2025 | 05:02 AM
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నా లోపల చికుక్కున్న 8 మందిని కాపాడలేకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
టన్నెల్‌లో నామామాత్రంగా చర్యలు
6 రోజుల్లో తట్టెడు మట్టీ తీయలేదు
సీఎంకు వచ్చి చూసే సమయం లేదా?
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ ధ్వజం
టన్నెల్ లోనికి అనుమతించనందుకు రోడ్డుపైనే శ్రేణులతో బైఠాయింపు
ఎస్‌ఎల్‌బీసీ జాప్యానికి వారే కారణం
ఇరిగేషన్‌ను నాశనం చేసిందే కేసీఆరే
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శ హరీశ్‌వన్నీ అవాస్తవాలు: జూపల్లి
నాగర్‌కర్నూల్/నార్సింగ్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నా లోపల చికుక్కున్న 8 మందిని కాపాడలేకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంఘటనా స్థలాన్ని పరిశీలించే సమయం లేదా, ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నికలే ముఖ్యమయ్యాయా అని ప్రశ్నించారు. టన్నెల్‌లో సహాయక చర్యలు నామమాత్రంగా జరుగుతున్నాయని, ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా బయటికి తీయకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రె్‌సలో కుర్చీల కొట్లాట మొదలైందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసి మంత్రులు హెలికాప్టర్లలో విహారయాత్రలు చేస్తున్నారని, ఇంటర్య్వూలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. గురువారం హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు శ్రీనివా్‌సగౌడ్, నిరంజన్‌రెడ్డి, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు టన్నెల్‌ను పరిశీలించేందుకు దోమలపెంట చేరుకున్నారు. పోలీసులు ముందు అనుమతించినా ఎక్కువమంది సభ్యులు గుంపుగా వెళుతుండటం, ఫొటోగ్రాఫర్లు, అనుమతి లేని వ్యక్తులు ఉండడంతో అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్‌ఎస్ బృందం కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా తర్వాత కొంతమందిని అనుమతించారు. సొరంగం లోపలికి వెళతామన్న వారి అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు.
ఈ సందర్భంగాను, అంతకుముందు గండిపేట మండలం కోకాపేట్‌లో తన నివాసం వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఆరో రోజు కూడా కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ జరగలేదని, టన్నెల్ బోరు మెషీన్ శిథిలాలను బయటకు తీయడానికి నాలుగు రోజుల సమయం అవసరమా అని ప్రశ్నించారు. టన్నెల్‌లో భారీ ప్రమాదం జరిగితే ప్రభుత్వాన్ని మొద్దునిద్ర ఆవహించిందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎ్‌సపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే టన్నెల్ కూలిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడటానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రూ.3,300 కోట్ల పని జరిగితే... పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎస్‌ఎల్‌బీసీకి రూ.3,900 కోట్లు కేటాయించామన్నారు. వరుసగా రెండేళ్లు కరోనా వచ్చినా 12 కిలోమీటర్ల టన్నెల్‌ను పూర్తి చేశామన్నారు. రేవంత్‌రెడ్డి 15 నెలల పాలనలో 15 మీటర్లు కూడా సొరంగాన్ని తవ్వలేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారగానే ప్లేట్ ఫిరాయిస్తున్నారని, దిగజారుడు రాజకీయాలకు పూనుకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15నెలల్లో ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. సుంకిశాల కుప్పకూలిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపుహౌజ్ నీట మునిగిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జలకళను కోల్పోయిందని, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు నుంచి జలదోపిడీ జరుగుతుంటే రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. టన్నెల్‌లోకి వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటే పోలీసులు అడ్డుకున్నారని, ప్రజాప్రతినిధులను ఇలా అణచివేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.