Share News

Harish Rao: బిల్లుల మంజూరుకు 20శాతం కమీషన్లా?

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:39 AM

‘‘మాది ప్రజా ప్రభుత్వమని ప్రచారం చేసుకునే భట్టి విక్రమార్క బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయానికి వేస్త ఎందుకు మొహం చాటేశారు? పోలీసులను అడ్డుపెట్టుకొని వెనుక గేటునుంచి ఎందుకు వెళ్లిపోయారు?

Harish Rao: బిల్లుల మంజూరుకు 20శాతం కమీషన్లా?

  • కాంట్రాక్టర్ల ధర్నా.. ప్రభుత్వ ప్రతిష్ఠకు మాయని మచ్చ

  • మంత్రులకు కమీషన్ల ఆరోపణలపై రాహుల్‌ స్పందించాలి

  • బనకచర్లతో 200టీఎంసీల తరలింపునకు బాబు కుట్ర

  • ఈ విషయంపై రేవంత్‌రెడ్డి స్పందించరా?: హరీశ్‌రావు

హైదరాబాద్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): ‘‘మాది ప్రజా ప్రభుత్వమని ప్రచారం చేసుకునే భట్టి విక్రమార్క బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు సచివాలయానికి వేస్త ఎందుకు మొహం చాటేశారు? పోలీసులను అడ్డుపెట్టుకొని వెనుక గేటునుంచి ఎందుకు వెళ్లిపోయారు? ప్రజా ప్రభుత్వమంటే పలాయనం చిత్తగించడమేనా?’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఢిల్లీ బాస్‌లకు కప్పం కట్టేందుకు అన్ని వర్గాల నుంచి మంత్రులు లంచాలు తీసుకుంటున్నారని లోకం కోడై కూస్తోందని పేర్కొన్నారు. సచివాలయంలోని ఆర్థిక మంత్రి చాంబర్‌ ఎదుట కాంట్రాక్టర్లు ధర్నా చేయడం.. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. బిల్లుల మంజూరుకు 20శాతం కమీషన్‌ తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లే స్వయంగా చెప్పడం.. ప్రభుత్వ ప్రతిష్ఠకు మాయని మచ్చగా నిలుస్తోందని పేర్కొన్నారు. నీతి సూత్రాలు చెప్పే రాహుల్‌ గాంధీ.. ఈ అంశంపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.


కమీషన్లకు ఆశపడి కొందరు మంత్రులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం, కాంగ్రెస్‌ ప్రభుత్వ కమీషన్ల కక్కుర్తి సచివాలయం సాక్షిగా బట్టబయలైందన్నారు. పెండింగ్‌ బిల్లులపై సర్పంచ్‌లు రోడ్డెక్కినా ప్రభుత్వం కరుణించడం లేదని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే రూ.6వేల కోట్లు బాకీ పడిందని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల తరహాలో ఉద్యోగులు కూడా కమీషన్లు ఇవ్వాల్సిందేనా? అని నిలదీశారు. కాగా, బనకచర్ల ద్వారా 200 టీఎంసీలను తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తుంటే రేవంత్‌రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని హరీశ్‌ ప్రశ్నించారు. బనకచర్ల ద్వారా గోదావరి వరద జలాలనే తీసుకువెళ్తామని, తెలంగాణకు నష్టమేమీ లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి చెబుతుంటే.. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ స్పందించరా? అని నిలదీశారు. మూడు నెలలుగా నాగార్జునసాగర్‌ కుడికాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకు పోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బనకచర్లతో తెలంగాణకు ఏం నష్టమని ఏపీ సీఎం స్పష్టంగా మాట్లాడి మూడు రోజులైనా సీఎం, రాష్ట్ర మంత్రులు ఎవరూ గట్టిగా స్పందించలేదని ఆరోపించారు. చంద్రబాబుతో దోస్తీచేస్తూ రాష్ట్రానికి మోసం చేస్తారా? అని నిలదీశారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 04:39 AM