Harish Rao: కాంగ్రెస్ మూర్ఖుల్లారా కళ్లు తెరిచి చూడండి
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:23 AM
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ మూర్ఖుల్లారా.. సిద్దిపేటతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గలగల పారుతున్న గోదావరి జలాలను కళ్లు తెరిచి చూడండి’’ అని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.
కాళేశ్వరం నీటితోనే రాష్ట్రంలో రెండు పంటలు
మేడిగడ్డలో పిల్లర్ కూలితే రాజకీయం చేశారు
మీరు వచ్చాక 4 పాజెక్టులు కుప్పకూలాయి
రేవంత్.. దోఖేబాజ్ మాటలు మానుకో: హరీశ్
సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేసిన కాంగ్రెస్ మూర్ఖుల్లారా.. సిద్దిపేటతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గలగల పారుతున్న గోదావరి జలాలను కళ్లు తెరిచి చూడండి’’ అని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్, రంగాయపల్లి గ్రామాల వద్ద రంగనాయక సాగర్ నుంచి కాలువలోకి నీటి విడుదలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ గాంధీభవన్‌లో కూర్చొని మాట్లాడటం కాదని, గ్రామాల్లోకి వచ్చి పారుతున్న గోదావరి జలాలను చూసి మేల్కోవాలని సూచించారు. తెలంగాణకు కాళేశ్వరం వర ప్రదాయిని అని, ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, యాదాద్రి, మెదక్ సహా పలు జిల్లాల్లో బంగారం లాంటి పంటలు పండుతున్నాయని చెప్పారు. కాళేశ్వరమే లేకుంటే ఈ ప్రాంతమంతా ఏడారేనని, బోరుబావుల్లో చుక్క నీరు ఉండేది కాదని, కాలువల ద్వారా ఒక్క పంట పండేది కాదని తెలిపారు.
రాష్ట్రంలో రెండు పంటలు పండుతున్నాయంటే కాళేశ్వరం వల్లేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం కూలిందంటూ కాంగ్రెస్ నాయకులు దొంగ మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, అనంతగిరి.. ఇవన్నీ కాళేశ్వరంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లాలో పెద్దవాగు, నల్లగొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం పంప్ హౌస్, నిన్న ఎస్‌ఎల్‌బీసీ కలిపి నాలుగు ప్రాజెక్టులు కుప్ప కూలాయని ధ్వజమెత్తారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగితే బీఆర్‌ఎస్ నాయకులు తప్పుచేశారంటూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడిన సీఎం రేవంత్.. ఈ నాలుగు ప్రాజెక్టులపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కాళేశ్వరం పిల్లర్ కుంగితే బీఆర్‌ఎస్ తప్పేనని నిందించిన రేవంత్‌రెడ్డి.. వారి పాలనలో నాలుగు ప్రాజెక్టులు కూలితే ప్రకృతి వైపరీత్యం అనడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా దోఖేబాజ్ మాటలు బంద్ చేయాలని హితువు పలికారు. 15 నెలలు గడుస్తున్నా కుంగిన పిల్లర్‌ను సరిచేయలేదని, ఇప్పటికైనా బాగుచేసి యాసంగికి సాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.