Alleti Maheshwar Reddy: రేవంత్ రెడ్డి.. నీకు ఇదేం అలవాటు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:55 PM
కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవంటూ సీఎం రేవంత్ రెడ్డిని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి చేసిన లక్షల కోట్లను ఎందుకు వెనక్కి తేలేకపోతున్నారంటూ మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ప్రతిపక్ష నేతల బట్టలు ఊడదీసే ఫాంటసీ ఏంటో అర్థం కావడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. ఏం చూద్దామని అలా మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చట్ట సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా అంటూ మండిపడ్డారు. మరో కేసీఆర్(KCR)లా రేవంత్ రెడ్డి తయారయ్యారని ఆగ్రహించారు.
అరెస్టు ఎప్పుడు..
ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ కుటుంబంపై రేవంత్ అవినీతి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఎప్పటివరకూ బయట పెడతారో ఆయన డేట్ చెప్పాలి. కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవి. కేసీఆర్ అవినీతి చేసిన లక్షల కోట్లను ఎందుకు వెనక్కి తేలేకపోతున్నారు. కేసీఆర్ అవినీతి సొమ్మును వెనక్కి తెస్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబసభ్యులను అరెస్ట్ చేస్తా, బొక్కలో వేస్తానని రేవంత్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. కాంగ్రెస్ సర్కార్ హామీల ఎగవేత, సమాధానాల దాటవేత అన్న ధోరణి ప్రదర్శిస్తోంది.
చర్చకు సిద్ధమా?
ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. " తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏకపాత్రాభినయం చూశాం. రేవంత్ తన కాలేజీ రోజుల్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లు ఉన్నారు. నేను గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే ఎక్కడా సమాధానం చెప్పకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పస లేని, మ్యాటర్ లేని ఏకాపాత్రాభినయం మాత్రమే రేవంత్ చేశారు. శాసనసభలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో.. ఆ గ్యారెంటీలకే చట్టబద్ధత లేకుండా పోయింది. శాసనసభ ఇంకా మరికొన్ని రోజులు కొనసాగుతుంది. ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా?. తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా?, ఇంకెవరైనా అడ్డుకుంటున్నారా? అనేది రేవంత్ చెప్పాలి.
మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది..!
రుణమాఫీ పూర్తి చేశామని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. నిర్మల్ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లయినా సరే రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధం. మేనిఫెస్టోలో పెట్టని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ డెవలప్మెంట్, మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాలను ఎందుకు ఎత్తుకున్నారు. లంకె బిందెల కోసమా?. మీ ఆస్థాన గుత్తేదారుల జేబులు నింపే శ్రద్ధ పేదలకు మంచి చేసేందుకు లేదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతను శాసనసభ నుంచి బహిష్కరించి దానిపైకి చర్చ డైవర్ట్ చేస్తున్నారు. మీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదంటే ఎలా?. దుబాయ్‌లో కేటీఆర్ ఏం చేశారో రికార్డులు ఉన్నాయన్నారు. వాటిని బయటపెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. మళ్లీ నేనే ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ చిట్ చాట్‍లో చెప్పారట. అంటే ఆయనకు నమ్మకం లేక అలా చెప్పారేమో. మంత్రులు ఆయన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఇక్కడే అర్థమవుతోంది. మరో ఐదేళ్లు కాదు.. ఈ ఐదేళ్లయినా సీఎంగా ఉంటారో లేదో చూసుకోండి. రేవంత్ ముందు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను సరిగ్గా కాపాడుకోవాలని" అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..
DK Aruna: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..