Share News

BRS MLA Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్

ABN , Publish Date - Jan 13 , 2025 | 07:52 PM

BRS MLA Arrest: కరీంనగర్ కలెక్టరేట్‍లో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టయ్యారు. ఆయన్ని కరీంనగర్ పోలీసులు సోమవారం హైదరాబాద్‍లో అరెస్ట్ చేశారు.

BRS MLA Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
BRS MLA Koushik Reddy

హైదరాబాద్, జనవరి 13: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పి. కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలించే అవకాశమున్నట్లు సమాచారం. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ పాల్గొన్నారు. ఆ క్రమంలో సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్ల కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా స్వల్ప ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఎమ్మెల్యే సంజయ్‌ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడారని ఆ ఫిర్యాదులో సంజయ్‌ స్పష్టం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్‌ రెడ్డి.. తనను అడ్డుకున్నారని చెప్పారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై రౌడీ షీట్ ఒపెన్ చేయనున్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అదీకాక గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‍గా మారిపోయారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాళ్లు విసురుతోన్నారు. ఇటీవల ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో చోటు చేసుకున్న వివాదాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ఆయనపై మండిపడ్డారు. దీంతో అరికెపూడి గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు 132, 351 (2) బీఎన్ఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఆ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు.

Also Read: ఛీ ఛీ అనిపించుకోను

Also Read: నెలకు రూ. 20 వేలు పెన్షన్.. శుభవార్త చెప్పిన సీఎం


దీంతో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ ఆర్డివో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ కంప్లైట్ ఇచ్చారు. దీంతో కౌశిక్‌ రెడ్డిపై బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352, 292 కేసులు నమోదు చేశారు. మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో ఆయపై 126 (2),115(2) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంకోవైపు జనవరి 10వ తేదీన 'గేమ్ చేంజర్' చిత్రం విడుదల సందర్భంగా.. టికెట్ ధరల పెంపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ త్రీ టౌన్‌ పీఎస్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదయ్యాయి.

Also Read: మహా కుంభమేళలో విగ్రహం కారణంగా రేగిన వివాదం

Also Read: కోడి పందాల్లో గెలవాలంటే.. ఇలా చేయండి

Also Read: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?


మరోవైపు పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పార్టీ లీగల్ టీమ్.. కరీంనగర్ బయలుదేరి వెళ్లింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈ రోజు రాత్రి.. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. ఈ నేపథ్యంలో అతడికి బెయిల్ ఇప్పించేందుకు లీగల్ టీమ్ ప్రయత్నించనుంది. ఇంకోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఇది అప్రజాస్వామిక చర్య అని వారు అభివర్ణించారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2025 | 09:41 PM