Hyderabad: ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం..
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:02 PM
ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రేపు చెక్కుల పంపిణీ చేయనున్నారు. దీంతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ క్లియర్ కానుంది.
హైదరాబాద్ : ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణలో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు రేపు చెక్కుల పంపిణీ చేయనున్నారు. చెక్కుల పంపిణీతో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించడానికి లైన్ క్లియర్ క్లియర్ కానుంది. కారిడార్-6 లో ఎంజీబీఎస్ - చంద్రాయణ్ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇంతవరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారని ఆయన వెల్లడించారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తి చేశారు.
అర్హులైన వారికి..
తొలి దశలో 40కి పైగా ఆస్తుల యజమానులకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నష్టపరిహారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రు. 81,000/- ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని, దీనితో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
40 కి పైగా..
భూసేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం పరిహారాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. లక్డీకాపుల్ దగ్గర ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు త్వరితగతిన మెట్రో పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, దీనిలో భాగంగా తొలుత 40 కి పైగా ఆస్తుల యజమానులకు ఇప్పుడు చెక్కుల పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారుల తరఫున మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.